కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరు నుంచి హెలికాఫ్టర్‌లో కణేకల్లు క్రాసింగ్‌లోని హెలిప్యాడ్‌కు సాయత్రం 6.20గంటలకు చేరుకున్నారు. రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సభా ప్రాంగణానికి 7.10గంటలకు చేరుకొని ప్రజలకు అభివాదం చేశారు. జనం ఈలలు, కేకలు వేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అందరూ సెల్‌ఫోన్ లైట్లు ఆన్ చేసి సంఘీభావం తెలియజేయాలని చంద్రబాబు కోరగా కార్యకర్తలు, అభిమానులు సెల్‌ఫోన్ల లైట్లు వెలిగించి సంఘీభావం తెలిపారు. శనివారం విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు.
source : eenadu.net
Discussion about this post