ప్రజలకు మంచి చేశానని చెప్పుకొంటున్న సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. యువచైతన్య రథం బస్సుయాత్ర చివరి రోజు సందర్భంగా ఆదివారం పెద్దవడుగూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోకి జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి రాగానే పూలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సైకో జగన్ ప్రజలకు ఏమి ఇచ్చినా ఆయన మళ్లీ వద్దంటున్నారని, తెదేపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మండలంలో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదన్నారు. చేనేత కాలనీలో తెదేపా హయాంలోనే సీసీ రోడ్లు వేశామని, వైకాపా ప్రభుత్వంలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో జేసీ కుటుంబానికి ఎమ్మెల్యే సీటు దక్కలేదని చెబుతున్నారని, ఎమ్మెల్యే ఒక్కటే కాదు రెండు సీట్లు సాధించుకుంటామన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తమకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తెదేపా ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉందని, వాటిని ప్రజలకు ఆయన వివరించారు. ప్రదర్శనలో జేసీ అస్మిత్‌రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ తెదేపాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రదర్శనలో మహిళల ఉత్సాహం చూసిన జేసీ ప్రభాకరరెడ్డి వారితోపాటు పాటలకు చిందులు వేశారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆవులాంపల్లి కేశవరెడ్డి, మాజీ ఎంపీపీలు కమలమ్మ, లీలావతి, దేవమ్మ, నాయకులు బాలిరెడ్డి, నారాయణస్వామి, నాగన్న, హరినాథరెడ్డి, సుబ్బారావు, సుంకిరెడ్డి, పరమేశ్వరరెడ్డి, ప్రసాద్‌యాదవ్, చిరంజీవులు, నగేశ్, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post