దేశంలో బిజెపి మరోసారి అధికారంలోకొస్తే అసలు సినిమా చూపిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను బెదిరించే ధోరణిలో ఉన్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన ఇండియా వేదిక తరఫున సిపిఎం అభ్యర్థిగా జొన్నా శివశంకరరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణ మండపంలో జరిగిన సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ ఇప్పటి వరకూ పదేళ్ల బిజెపి పాలనలో ట్రయల్ మాత్రమే చూశారని, మళ్లీ గెలిస్తే అసలు సినిమా చూపిస్తానని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రజలపై కక్ష కట్టడమేనని పేర్కొన్నారు. బిజెపిని గద్దె దించడానికి 27 పార్టీలతో ఇండియా వేదిక ఏర్పాటైందన్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరసత్వం వంటి చట్టాలను కఠినంగా అమలుకు పూనుకుంటుందన్నారు. ముస్లిములు, గిరిజనులు, దళితుల హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం వల్ల దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు పొందే అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. రాష్ట్రంలో ఓట్లు, సీట్లు లేని బిజెపికి టిడిపి, జనసేన మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. అధికార వైసిపి గత ఐదేళ్లుగా బిజెపికి అంటకాగుతోందని వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాజధాని నిర్మించకపోయినా ఈ మూడు పార్టీలూ నోరెత్తడం లేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి మద్దతు పలుకుతున్న ఆ మూడు పార్టీలూ ప్రజలకు ద్రోహం చేసినట్టేనన్నారు. బిజెపి తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు, వ్యవసాయ నల్ల చట్టాలకు వైసిపి, టిడిపి మద్దతు పలికాయని, కేంద్రం నుంచి రావాల్సిన విభజన చట్టం హామీలు అమలు చేయాలని మాత్రం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని వివరించారు. సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తే ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో, ఓడితే రోడ్డుపై పోరాటం చేస్తామన్నారు. రాజధాని అమరావతిలోని కొనసాగించడానికి ఇండియా బ్లాక్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మంగళగిరి అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావును, గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ను, ఇతర ప్రాంతాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి, టిడిపిలకు రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 2014 సంవత్సరం ముందు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉందగా, రూ.25 పెంచితే మోడీ, బిజెపి నాయకులు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారని, నేడు మోడీ పాలనలో గ్యాస్ ధర వెయ్యి రూపాయలు ఉందని వివరించారు. సిపిఎం సీనియర్ నాయకులు, రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు మాట్లాడుతూ ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పటి కన్నా మోడీ హయాంలో నిర్బంధం పెరిగిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేసి నేరం నిరూపణ కాకముందే జైలుకు పంపించిన ఘనత మోడీకి దక్కిందని ఎద్దేవా చేశారు. రైతులకు నష్టం కలిగించే విద్యుత్ మీటర్లు పెట్టారని, ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డి.శామ్యూల్ మాట్లాడుతూ ప్రజలకు అండదండలుగా ఉండే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు.
source : prajasakthi.com
Discussion about this post