ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్త పండుగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయనను చూడటానికి జనసంద్రం పోటెత్తింది. ఊరూవాడా వెల్లువలా ప్రజలు తరలివచ్చారు. అక్కచెల్లెమ్మలు దిష్టితీసి హారతులు పట్టారు. హత్యాయత్నం నుంచి బయటపడి తమ వద్దకు వచ్చిన సీఎం జగన్‌ను చూడటానికి అభిమాన సంద్రం ప్రవాహంలా పోటెత్తింది.
తనను చూడటానికి వచ్చిన అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చిన్నారులను బస్సు దిగి సీఎం ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఓవైపు మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావంటూ అవ్వాతాతల ఆశీర్వచనాలు, మరోవైపు మా ఓట్లు మీకే అంటూ అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఇంకోవైపు మేమున్నామన్నా అంటూ యువకుల ఉత్సాహం మధ్య బస్సు యాత్ర ఆద్యంతం సంబరంలా సాగింది.
సోమవారం గుడివాడ బహిరంగ సభ ముగించుకుని ఏలూరు జిల్లా నారాయణపురం చేరుకుని రాత్రి బస చేసిన సీఎం వైఎస్ జగన్‌ను మంగళవారం ఉదయం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. వారి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నారాయణపురం శివారు ప్రాంతానికి చెందిన ఉండ్రాజవరపు భుజంగరావు, గీతారాణి దంపతులు సీఎం బస్సు వద్దకు వచ్చారు.
తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని సీఎం జగన్‌ను కోరగా ఆయన వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చి బాలుడితో అక్షరాలు దిద్దించారు. తమ అభిమాన నేతతో తమ బిడ్డకు అక్షరాభ్యాసం చేయించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది ఎన్నటికీ మరువలేమని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తనపై అభిమానంతో ఓ చెల్లెమ్మ వేసిన పెన్సిల్ స్కెచ్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సుయాత్ర నారాయణపురం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. రాచూరు చేరుకున్న సీఎం జగన్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు.
source : sakshi.com
Discussion about this post