బీజేపీ కోరితేనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్నానని, పొత్తును తాను కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం కుప్పంలో ముస్లింలు, యువత, ఆ తర్వాత హంద్రీ నీవా వద్ద జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ముస్లింలతో సమావేశం సందర్భంగా బీజేపీ కోరితేనే పొత్తు పెట్టుకున్నట్లు మాట్లాడారు. ‘పొత్తు కావాలని నేను వెళ్ళలేదు. వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ ఆ సమావేశానికి వచ్చిన వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్డీయే ఉన్నప్పుడు, లేనప్పుడు మైనార్టీలకు అండగా నిలిచింది తామేనని చెప్పారు. పొత్తు సీట్ల కోసం కాదని అన్నారు.
ఎన్నికల కోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్‌ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్ళు నింపుతానని, కుప్పాన్ని బెస్ట్ టౌన్‌గా చేస్తానని అన్నారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు ఒక ట్యాంకర్‌లో నీళ్లు తెచ్చి సినిమా సెట్టింగులు వేసి కుప్పానికి నీళ్ళిచ్చేశానంటూ ప్రజలను ఏమార్చారని ఆరోపించారు. తెచ్చిపోసిన నీళ్ళు తెల్లారేసరికి ఇంకిపోయాయని, అద్దె గేట్లు సాయంత్రం ఎత్తుకెళ్ళారని విమర్శలు చేశారు. త్వరలో డ్రామా కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
వలంటీర్ వ్యవస్థ పూర్తిగా రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారని, దాని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తామన్నారు. వారి వద్ద ఉన్న డేటాను ఈసీ కలెక్ట్ చేసుకోవాలని కోరతామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయలేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హంద్రీ–నీవా కాలువకు నీటిని తీసుకువస్తామన్నారు. ఇప్పటి వరకు కుప్పంను అభివృద్ధి చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కుప్పం భూమిపై నడిస్తే అరిగిపోతారని రెండు హెలిక్యాప్టర్లలో తిరిగారని సీఎం జగన్‌పై విమర్శలు చేశారు.
రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫికెట్లపై సీఎం జగన్ ఫోటో పెట్టుకున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పడు ఇజ్రాయిల్ టెక్నాలజీ నిలిపివేశారని, ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాక మొత్తం నాశనం చేశారని విమర్శించారు. గుండిశెట్టిపల్లి వద్ద మన్యం భూములు కొట్టేయాలని చూస్తున్నారని అన్నారు. నేర సామ్రాజ్యానికి విజయసాయిరెడ్డి వరల్డ్ ఫిగర్ అని, తప్పులు చేసి ఎదుటి వారిని నిందిస్తుంటారని అన్నారు.
కుప్పం పట్టణం బాబునగర్‌లో ఇంటింటా ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ఓ వృద్ధురాలి నుంచి ఎదురైన ప్రశ్నతో షాక్ తిన్నారు. టీడీపీ హయాంలో రోడ్డు విస్తరణలో తన ఇల్లు కొట్టేశారని, ఇల్లు ఎప్పుడు కట్టిస్తారంటూ వెంకటమ్మ అనే వృద్ధురాలు బాబును నిలదీసింది. ఈ ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయోనని ఆరు ఇళ్లు మాత్రమే తిరిగి 20 నిమిషాల్లోనే ఆ కార్యక్రమాన్ని ముగించి రామకుప్పం మండలం రాజుపేటకు వెళ్లిపోయారు.
source : sakshi.com
Discussion about this post