పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒంగోలులో సుమారు 21వేల మందికి నివాసస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. తొలుత ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు కొందరు కోర్టులో పిల్ వేశారని, అయినా ప్రక్రియ ఆగలేదని చెప్పారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పట్టాలు పంపిణీ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు 1900 వరకు కేసులు వేశారని చెబుతూ, ఒంగోలు పట్టాలు పంపిణీపై కోర్టులో పిల్ వేసింది కూడా ఆ మహానుభావుడేనని వ్యాఖ్యానించారు. అయితే నిజానికి కోర్టులో పిల్ వేసింది వైసీపీ నేత సింగరాజు రాంబాబు. గత ఎన్నికల్లో బాలినేని పక్షాన పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆయనకు దూరమై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇది ప్రజలకు, వైసీపీ నేతలకు తెలిసిన నగ్నసత్యం. వైసీపీ స్థానిక నేతల మధ్య విభేదాలే దీనికి కారణం. అయినా, జగన్ మాత్రం ఆ పాపం చంద్రబాబుదే అంటూ పదేపదే వ్యాఖ్యానించటంతో వేదిక మీద ఉన్న జిల్లాకు చెందిన వైసీపీ నేతలే గాక సభకు హాజరైన వారు కూడా నివ్వెరపోయారు. అలాగే… చిత్తూరు జిల్లా పర్యటనలో భువనేశ్వరి ఎన్నికల కురుక్షేత్రానికి మనం సైసై అంటూ…. మీరూ సై యేనా అని అడగ్గా ప్రజలు సైసై అంటూ నినాదాలు చేశారు. తన పోటీపై సరదా వ్యాఖ్యలు మాత్రమే చేశారు. దీనిని కూడా జగన్ వక్రీకరించారు. ‘‘నేను ఎన్నికలకు సిద్ధం అంటే బాబు భార్య మాత్రం మా ఆయన సిద్ధంగా లేడంటున్నారు. నేను సైసై అంటే బైబై అంటున్నారు’’ అని జగన్ వ్యాఖ్యానించారు తన అబద్ధాలతో ప్రజలను నమ్మించేందుకు తడబడుతూ విశ్వప్రయత్నం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ కోసమే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరును సీఎం కనీసం ప్రస్తావించలేదు. దీంతో బాలినేని, ఆయన అనుచరులు అసంతృప్తికి గురయ్యారు.
source : andhrajyothi.com
Discussion about this post