ఇంటివద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 32 మంది పింఛనుదారుల్ని ముఖ్యమంత్రి పొట్టన పెట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారి ఆత్మలు ముఖ్యమంత్రిని భూస్థాపితం చేస్తాయని హెచ్చరించారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరుల్లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్లి అందించాలన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.2వేలకు పెంచింది తానేనన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని.. పెంచిన మొత్తాన్ని ఈ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని పునరుద్ఘాటించారు.
సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని, సీమకు కేటాయించిన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్డీఎస్‌కు రూ.1,955 కోట్లు ఇస్తే ఖర్చు పెట్టలేదని, వేదవతి ప్రాజెక్టుకు రూ.1,942 కోట్లు ఇస్తే పంప్‌హౌస్, కాలవ పనులను నిలిపివేశారని ధ్వజమెత్తారు. గుండ్రేవులను కూడా గాలికొదిలేశారన్నారు. ఈ ముఖ్యమంత్రికి నీటి విలువ తెలియదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రికి ఒక విజన్.. ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సామర్థ్యం ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఆస్తుల్ని దోచుకోవాలన్న ఆలోచన తప్ప… వారిపై ఎలాంటి ప్రేమా లేదన్నారు. హైదరాబాద్‌ను మించిన రాజధానిని అమరావతిలో నిర్మించాలనుకుంటే దాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని దుయ్యబట్టారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లుంటే… ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, ఓట్లు దండుకుని 49 సీట్లు గెలిచి చివరకు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శించారు.
జగన్ మ్యానిఫెస్టోకు ప్రజలు జీరో మార్కులు వేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన మ్యానిఫెస్టో అట్టర్‌ఫ్లాప్ అయ్యిందన్నారు. అందులో ఏమీ లేదని… జగన్ చేతులెత్తేశారని పేర్కొన్నారు. బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా అని నిలదీశారు. తెదేపా సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.
source : eenadu.net
Discussion about this post