ఒకటో తేదీనే ఇంటికి పంపిస్తా: చంద్రబాబు
మా కూటమి గద్దెనెక్కితే ప్రజాస్వామ్యం మీద దాడి ఉండదు. వ్యవస్థల నిర్వీర్యం ఉండదు. నమ్మకం, భరోసా ఇచ్చే పాలన మా కూటమితోనే సాధ్యం.
వైసీపీ దుర్మార్గ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది. వారి జోలికొస్తే అదే ఆఖరి రోజు అన్నంతగా పాలన సాగిస్తా.
నన్ను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు భయపడి పారిపోలేదు. మీ కోసం నిలబడ్డాను. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. నేను అనుభవించిన పదవే అది. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం.
– చంద్రబాబు
పేదలకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఒకటో తేదీనే ఇంటికి పంపించేలా చేస్తానన్నారు. బయటి ప్రాంతాలకు వెళ్లినవారికి మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే టీడీపీ, జనసేన, బీజేపీ ఎజెండాగా పేర్కొన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పర్యటించారు. మధ్యాహ్నం మహిళలతో సమావేశం అనంతరం బస్టాండు సర్కిల్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నట్లు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సంకల్పం తీసుకోవాలన్నారు. కేంద్రంలో ఎన్డీయే 400 ఎంపీ సీట్లను గెలవాలని, రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి 160కిపైగా అసెంబ్లీ స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని.. రాష్ట్ర పరిస్థితి చూసి మోదీ కూడా ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదని.. తమను ఆశీర్వదించి తమతో నడవాలని, టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..
వీటి కోసం ఎన్డీయే రావాలి..
రాష్ట్రంలో ఎన్డీయే ఎందుకు అధికారంలోకి రావాలంటే.. రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తారీఖున జీతం ఇవ్వాలి. మాకు అఽధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు. ధరల బాదుడు ఉండదు. కక్షపూరిత రాజకీయాలుండవు. కూటమికి ఓటేస్తే ముస్లింలకు రక్షణ ఉండదని కొందరు రెచ్చగొడుతున్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీనే. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం. ఉర్దూను రెండో భాషగా చేశాం. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం.
source : andhrajyothi.com
Discussion about this post