ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి హేయమైన చర్య అని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంతమ్మ ఖండించారు. ఆదివారం పుట్టపర్తిలోని ఎనుములపల్లి గణేష్ కూడలిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దుకుంట, శాంతమ్మ మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భౌతికదాడులకు దిగుతున్నారన్నారు. అన్ని సర్వేలూ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని తెలపడంతో చేసేదిలేక ప్రతిపక్ష పార్టీ నేతలు బరితెగిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదన్నారు. నావల్ల మేలు జరిగి ఉంటే ఓటు వేయండి అని ధైర్యంగా అడిగిన వైఎస్ జగన్‌ను ప్రజల నుంచి ఎవ్వరూ దూరం చేయలేరన్నారు. దాడి వెనుక ఎంతటి వారు ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నిరసనాగ్రహం పెల్లుబుకింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు ముక్తకంఠంతో దాడిని ఖండించారు. నిందితులు, కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా అంతటా శాంతియుతంగా నిరసన తెలిపారు. పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు గాంధీ చిత్రపటం, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేశారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ప్రతిపక్ష కూటమి హత్యకు కుట్ర పన్నిందన్నారు. చంద్రబాబు డౌన్‌డౌన్.. పవన్ కల్యాణ్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ఎడమ కంటికి గాయమైన ఫొటోలు చూసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ‘ఎందుకయ్యా.. ప్రజలంటే నీకంత పిచ్చి.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నీపైనా దాడి..?’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు సానుభూతి వ్యక్తం చేశారు.
source : sakshi.com
Discussion about this post