ఎన్‌పీఎస్(కొత్త పెన్షన్ పథకం) వాటా నిధుల్ని 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో.. ప్రయోజనాలను కోల్పోతున్నామనే ఆందోళన సాధారణ ఉద్యోగుల్లోనే కాదు, ఐఏఎస్ అధికారులనూ వేధిస్తోంది. పథకం వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని వారు వాపోతున్నారు. అంతర్గత గ్రూపు సంభాషణల్లో దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి. బహిరంగంగా ఎవరూ మాట్లాడటం లేదు. సంఘ సమావేశాల్లో చర్చలకూ భయపడుతున్న పరిస్థితులున్నాయి. సోమవారం జరిగే ఐఏఎస్ అధికారుల సంఘ సమావేశంలో దీన్ని ఎజెండాగా చేర్చి చర్చించాలనే సూచనలు కొందరు అధికారుల నుంచి రాగా.. మరికొందరు దాన్ని బహిరంగ చర్చకు పెట్టొద్దని వారించారు. టేబుల్ ఎజెండాగా చర్చిద్దామని, ఇలాంటి సున్నిత విషయాలను ఎజెండాలో పెట్టకుండా ఉండటమే మంచిదని సూచించారు. అప్పుడు కూడా దీనిపై పెద్దగా చర్చలు చేయకుండా.. ఎక్కువ ప్రచారం లేకుండా ముగించాలని చెప్పడం గమనార్హం. దీనిపై పత్రికల్లో వార్తలకు తావీయకూడదని, నిశ్శబ్ద పరిష్కారం సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని సూచించారు.
సీపీఎస్‌పై మడమ తిప్పిన జగన్
2004 సెప్టెంబరు 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ సీపీఎస్ వర్తిస్తుంది. అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. సీఎం అయ్యాక మడమ తిప్పేశారు. పాత పెన్షన్ పథకం(ఓపీఎస్) అమలు చేస్తే వారికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోయే పరిస్థితి లేదని చెబుతూ.. ద్రోహం చేశారు. ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పి జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ పథకం) తీసుకొచ్చారు.
ఉద్యోగి వాటానే ఇద్దరిదిగా చూపిస్తూ..
కొత్త పెన్షన్ పథకం కూడా సరిగా అమలు చేయడం లేదు. సుమారు 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయడం లేదని ఐఏఎస్ అధికారులే చర్చించుకుంటుండటం గమనార్హం. కొందరు జూనియర్ ఐఏఎస్ అధికారులు దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగి తన వాటాగా పది నెలలు చెల్లిస్తే.. దానికి రాష్ట్ర వాటా కలిపి జమ చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగి పది నెలల వాటానే.. ఇద్దరి వాటాగా చూపిస్తూ అయిదు నెలలకు మాత్రమే జమ చేస్తోంది. ఎన్‌పీఎస్ పథకం కింద ఉద్యోగి, ప్రభుత్వ వాటా కలిపి ఏడాదికి రూ.4,200 కోట్లు అవుతుందని రాష్ట్ర సర్కారే ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే ఈ మొత్తంపై వచ్చే ప్రయోజనాలు ఉద్యోగులకు అందడం లేదు.
source : eenadu.net
Discussion about this post