దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మదనపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీయేనేనని, తాము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి ప్రజలకు పంచుతామని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని ప్రకటించారు.
‘‘బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారు. చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిందలు భరిస్తున్నాం. రాజకీయాల్లో ఎన్ని విభేదాలు ఉన్నా.. సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసేవాళ్లను ఏమనాలి? ఆడబిడ్డలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారు. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. మంత్రి పెద్దిరెడ్డికి.. ఇసుకే ఉదయం అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోంది. కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకుంటున్నారు. ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు. రౌడీయిజం కావాలా? ప్రజాస్వామ్యం కావాలా? ప్రజలే తేల్చుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.
source : eenadu.net










Discussion about this post