కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని కొందరు సూచిస్తున్నారని, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సామాజిక మాధ్యమ బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంతో తపన పడ్డాను. ఈ పొత్తును ఇక్కడి వరకు తీసుకురావడానికి ఎంతో నలిగాం, కష్టపడ్డాం, త్యాగాలు చేశాం. భాజపాను పొత్తులోకి తీసుకొచ్చి జగన్ తోక కత్తిరిస్తున్నాం. నా బాధ్యత నిర్వహించాను.
మీ బాధ్యత మీరు నిర్వహించండి. ఇన్నాళ్లూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. జగన్ ఏమీ చేయకుండా ఒక్క అవకాశం ఇమ్మన్నారు. నేను ఎంతో చేసి ఇప్పుడు అడుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ను చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పొత్తును గెలిపించండి, జనసేనను గెలిపించండి’’ అని పవన్‌కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతోమందిని ఏడిపించి కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ప్రకటించారు.
తాడేపల్లి ప్యాలెస్‌నూ ఆక్రమిస్తారు
‘‘శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్‌కూ పడుతుంది. అప్పు చేసి డబ్బులు పంచితే సంక్షేమం అవ్వదు. రాష్ట్ర ఖజానాకు రూ.10వేల కోట్లు వస్తే అందులో రూ.5వేల కోట్లు జగన్ తీసేసుకుని, రూ.500 కోట్లు మిగిలిన వాళ్లకు పంచుతారు. రూ.500 కోట్లు సిద్ధం సభలకు, రూ.450 కోట్లు సిద్ధం పోస్టర్లకు. రూ.54.35 కోట్లు గ్రాఫిక్స్‌కు, మిగతా డబ్బు సంక్షేమానికి పెడతారు. అప్పు చేసి డబ్బులు పంచుకుంటూ పోతే శ్రీలంక అధ్యక్షుడి ప్యాలెస్‌ను ప్రజలు ఎలా ఆక్రమించారో, తాడేపల్లి ప్యాలెస్‌నూ అలాగే ఆక్రమిస్తారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేసి, వాటిద్వారా సంపద సృష్టిస్తాం. ఆ సంపదను ప్రజల సంక్షేమానికి పంచిపెడతాం. నేను సినిమాలు చేస్తున్నా. ఆ సినిమాలతో వచ్చిన సొమ్ముల్లోంచి కౌలు రైతులకు ఇస్తున్నా. సంపద సృష్టించి ప్రజా సంక్షేమానికి పంచాలి’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో చూస్తారు
‘‘మధ్యతరగతి వాళ్ల గురించి ఏ పార్టీ నాయకులూ మాట్లాడరు. వాళ్లకు కులం, మతం, ప్రాంతం ఏమీ ఉండవు. సగటు మధ్యతరగతి మనిషి మేల్కొంటే దేశ రాజకీయం మారుతుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడమే కాదు.. లేచి కొట్లాడాలి. మధ్యతరగతి వాడికి కావల్సినవి అందించడానికే తెదేపా, జనసేన, భాజపా కలిశాయి. మధ్యతరగతి తమ బిడ్డలు బాగుండాలి, రోడ్లు బాగుండాలి అనుకుంటారు. వైకాపా వాళ్లు రౌడీలను చూసి ఉండొచ్చు గానీ, మధ్యతరగతి వ్యక్తి తిరుగుబాటును రుచిచూడలేదు. మధ్యతరగతికి వాడికి కోపం వస్తే ఎలా ఉంటుందో విశాఖలో చూపించాం. విప్లవం అనేది కత్తులు, కర్రలతో రాదు. అన్యాయం ఎక్కువ అయినప్పుడు ప్రజలు రోడ్లమీదకు రావడమే విప్లవం’’ అని జనసేన అధినేత అన్నారు.
వైకాపాను తిట్టాల్సిన పెద్దలు మనల్ని తిడితే ఎలా?
‘‘పవన్‌కల్యాణ్‌కు సలహాలు ఇవ్వడం చాలామందికి నచ్చుతుంది. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వారే చెబుతారు. పెద్దలకు గౌరవం ఇస్తాను. కానీ వైకాపాను తిట్ట్లాల్సిన సమయంలో మనల్ని తిడితే ఎలా? అది వారు ఆలోచించుకోవాలి. నేను కూడా జనసేనకు ఓట్లు పెరిగాయని, బలం పెరిగిందని ఈగోతో వెళ్తే సీట్లు పెరిగేవి. కానీ వైకాపా ప్రభుత్వం పోవాలన్న ఈ రాష్ట్ర సగటు మనిషి బలమైన కోరికకు అడ్డంకులు ఏర్పడేవి. రాష్ట్ర క్షేమం కోసం త్యాగాలు తప్పలేదు. ఒక రాజ్యం కోసం ఒక గ్రామం పోయినా పర్వాలేదన్నది విదురనీతి. అలాగే 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం కొన్ని స్థానాలు త్యాగం చేయక తప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గడం చాలా అవసరం. తగ్గేకొద్దీ ఎదుగుతాం తప్ప ఏ అనర్థం ఉండదు. 2019లో నా వ్యూహం అమలుచేసి ఉంటే 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు వచ్చేవి, ఇప్పటికే పార్టీ గుర్తింపు పొందేది’’ అన్నారు.
source : eenadu.net
Discussion about this post