మొన్నటి వరకు వచ్చిన భర్త పింఛన్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆ కుటుంబ జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. పక్షవాతానికి గురైన మహిళ తన భర్తతో పాటు మానసికస్థితి సరిగా లేని కుమార్తె ఆలన పాలన చూసుకోవడానికి తీవ్ర కష్టాలు అనుభవిస్తోంది. యాడికి పట్టణం కోనరోడ్డులోని చౌడేశ్వరి దేవాలయం సమీపంలో వెంకటరాముడు, తులశమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి వెంకటలక్ష్మీ, వెంకటనారాయణమ్మ, అనిత ముగ్గురు సంతానం కాగా అందరికీ వివాహాలు చేశారు. మొదటి కుమార్తె వెంకటలక్ష్మీకి పెళ్లైన కొన్ని రోజుల్లోనే మానసికస్థితి బాగోలేక పోవడంతో భర్త పుట్టింట్లోకి తెచ్చి వదిలేశాడు. తులశమ్మ వేములపాడు సమీపంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో అవుట్ సోర్సింగ్ కింద వంట పనికి సహాయకురాలిగా దాదాపు ఎనిమిదేళ్లు పని చేసింది. జీవనం సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమె పక్షవాతానికి గురై ఇంటి వద్దే ఉంటున్నారు. భర్త చేనేత పింఛన్‌తో జీవనం సాగించేవారు. అయితే ఆమె ఉద్యోగం చేస్తోందన్న కారణంతో పింఛన్ తొలగించారు. కుమార్తెకు మానసికస్థితికి చికిత్స కోసం దాదాపు రూ.50 వేల దాక ఖర్చు చేశారు. రెండేళ్ల నుంచి మగ్గం నేయడం చేతకాక భర్త.. పక్షవాతంతో భార్య.. మానసికస్థితి సరిగా లేక కుమార్తె ఇబ్బందులు పడుతున్నారు. తాను తాత్కాలిక ఒప్పంద కార్మికురాలిగా పని చేయడం వదిలేశానని, పింఛన్‌ను పునరుద్ధరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్షవాతంతో చేయి, కాలు పని చేయకపోయినా కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు వాపోయారు. దస్త్రాల్లో తన పేరు తొలగించి, భర్తకు పింఛన్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కుమార్తె చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని తులశమ్మ వేడుకుంటోంది.
source : eenadu.net
Discussion about this post