పాలెగాళ్ల రాజ్యంలో ప్రజలు విసిగి పోయారని, ప్రజాపాలన రావాలని అంతా కోరుకుంటున్నట్లు కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీ తెదేపా అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి బాల్యం రాజేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి రాగానే కురుబలకు రుణాలిచ్చి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. కురుబలకు మొదట రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెదేపానే అని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందన్నారు. తాము గెలిచాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నర్సింగ్ కళాశాల తీసుకొస్తామని, కనకదాస విగ్రహాలు ఏర్పాటు చేసి, గుడికట్ల విజయోత్సవాలు నిర్వహించేలా చూస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు కురుబలు కంబలి, గొర్రె పిల్లను బహూకరించి, గజమాలతో సత్కరించారు.
రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందన్నారు. జగన్‌కు ఇదే మొదటి, చివరి అవకాశమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాశనం అవుతున్న వ్యవస్థలను పవన్‌కల్యాణ్ అడ్డుకొంటూ రోడ్లపైకి వస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post