టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత పార్టీ నేతలే ఆయనకు మద్దతు పలకడం లేదు. ఇప్పటికే పెనుకొండలో తిరుగుబాటు చేసిన సవితమ్మ పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ సారి టికెట్ తనదేనంటూ హడావుడి చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీకే పార్థసారథి ఒంటరిగా మిగిలిపోయారు. కానీ పట్టునిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ‘జయహో బీసీ’ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించాలని, తద్వారా పెనుకొండలో తనపట్టు చూపాలని భావించారు.
అయితే బుధవారం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమానికి టీడీపీ బీసీ నేతలు చాలా మంది దూరంగా ఉన్నారు. ముఖ్యనేతలైన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మతో పాటు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాలకు చెందిన బీసీ నాయకులు చాలా మంది గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు తెరపైకి వచ్చినట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా, పెనుకొండ ఎమ్మెల్యేగా పార్థసారథి, హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండేవారు.
అప్పుడే వారి మధ్య వర్గ విభేదాలు పొడచూపాయి. అప్పట్లో పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ ఇరువురు నేతలు ఎడముఖం, పెడముఖంగా ఉండేవారు. దీంతో పార్టీ కేడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఆధిపత్య ధోరణిలో ఒక వర్గం, మరోవర్గంపై దాడులకు సైతం తెగబడింది. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతుండగా, ఇక పెనుకొండలో టీడీపీ గెలవడం కలేనని బుధవారం జరిగిన జయహో బీసీ సభలో కార్యకర్తలు చర్చించుకున్నారు.
source: sakshi.com
Discussion about this post