సత్యవేడు నియోజకవర్గంలో సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ను నేతలు, కార్యకర్తలకు పరిచయం చేశారు. సమావేశానికి నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన పార్టీ నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థి ఎవరైనా మనకి జగనన్నే ముఖ్యమని, ఆ దశగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. 2019లో వచ్చిన 43వేల మెజారిటీ కంటే ఎక్కువ ఆధిక్యత రావాలని సూచించారు. రాబోయే ఎన్నికలు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్త, నాయకుడు తామే అభ్యర్థులుగా భావించి పనిచేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గం సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో సేవకుడిలా పనిచేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడించారు.
source : sakshi.com
Discussion about this post