తెదేపా అధినేత చంద్రబాబుపై కార్యకర్తలకు ఉన్న అభిమానం వెలకట్టలేనిదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఆయన అక్రమ అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి, పర్చూరు మండలం చిననందిపాడు, యద్దనపూడి గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన తెదేపా కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చెరుకుపల్లిలో భువనేశ్వరి పరామర్శించారు. ఆయన భార్య విజయలక్ష్మికి రూ.3 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. చిననందిపాడులో మృతి చెందిన మువ్వా సింగారావు ఇంటికి వెళ్లి ఆయన భార్య పార్వతిని పరామర్శించి రూ.3 లక్షల చెక్కు అందజేశారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆమె వెంట ఉన్నారు. అడుసుమల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యద్దనపూడిలో మృతి చెందిన టెక్కెం నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన భార్య దేవునిదయను ఓదార్చారు. రూ.3 లక్షల చెక్కు అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు బి.ఎన్.విజయకుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్, జడ్పీటీసీ మాజీ సభ్యులు దాసరి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. నిజం గెలవాలి యాత్ర బుధవారం దర్శి, కొండేపి, కందుకూరుల్లో సాగనుంది. గురువారం కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు.. శుక్రవారం ఆత్మకూరు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.
source : eenadu.net
Discussion about this post