‘కొన్ని అభిప్రాయ విభేదాల కారణంగా ఇన్నాళ్లు విడివిడిగా కార్యక్రమాలు చేశాం. ఇక నుంచి కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి ముందుకెళ్తామ’ని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, పార్టీ నియోజకవర్గం బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తెలిపారు. కొన్నేళ్లుగా వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్న వారిద్దరూ ఒకే వేదికపై వచ్చి మాట్లాడారు. ఇద్దరూ కలుస్తున్నారని తెలియడంతో బుధవారం పార్టీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముందుగా ఉన్నం మాట్లాడుతూ ‘చాలా రోజుల తరవాత మనమందరం కలిసిపోవడం శుభపరిణామం. ప్రసుత్తం నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేద్దాం’అని పేర్కొన్నారు. ఉమా మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులెదురైనా తెదేపా జెండాను కళ్యాణదుర్గంలో ఎగురవేయాలని, చంద్రబాబునాయుడును సీఎం చేసుకోవాలని నాయకులు, కార్యకర్తలు సమష్టితో పనిచేస్తామని చెప్పారు. పార్టీలో చిన్నచిన్న విభేదాలను చూపుతూ కొందరు వ్యాపారవేత్తలు నియోజకవర్గంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తమ, ఉన్నం కుటుంబాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నాం. మేమే కాకుండా పార్టీ జెండా మోసే ఎవరికైనా టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. టికెట్ విషయంలో పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అందరితో ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తానని గతంలో చెప్పారని, ప్రస్తుతం చేస్తున్న అసత్యా ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తెదేపా నాయకుడు మారుతీచౌదరి మాట్లాడుతూ కష్టపడి పార్టీకి పనిచేసే వారికి అవకాశం ఇస్తే గెలిచి చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post