సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న షర్మిల, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదులు చేసి, వాటికి ఆధారాలను కూడా సమర్పించారు. ‘టీడీపీ నేతలు సీఎం జగన్‌ని సైకోగా సంబోధిస్తూ పాటను సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం.
టీడీపీపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అనుసరించి చర్యలు తీసుకోవాలి. జనసేన అధ్యక్షుడు పవన్ నరసాపురం, భీమవరం సభల్లో సీఎం జగన్‌పైన, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, సజ్జల రామకృష్ణారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వివేకానందరెడ్డి హత్య గురించి బహిరంగ సభల్లో పదేపదే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి’అని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మల్లాది విష్ణు వెంట మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, పార్టీ లీగల్ సెల్ నేత కొమ్మసాని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
సీఈవోకి ఫిర్యాదు అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. నర్సాపురం, భీమవరం సభల్లో పవన్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు. ఒక సీఎంని పట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకోమని, నాలుక కత్తిరిస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్న పవన్‌కు సీఎంను విమర్శించే స్థాయి లేదని అన్నారు. పవన్ తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎన్నికల నియమావళిని పదే పదే ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దని కోర్టు చెప్పినప్పటికీ, షర్మిల పదేపదే ప్రస్తావిస్తున్నారన్నారు. అలాగే జాబ్‌లు, కొండలు, రోడ్లపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్న పాటను పోస్టు చేసిన వారితో పాటు రాసిన వారు, కంపోజ్ చేసిన వారు, పాడిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలలోని పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరామన్నారు.
సీఎం సభకు లక్షలాది మంది ప్రజలు తరలిరావడం, విజయవాడలో దాడి నేపథ్యంలో సీఎం జగన్ భద్రత పట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైందని, దానిని కూడా టీడీపీ తప్పు పట్టడం సరికాదని అన్నారు. సీఎంకు కనీస భద్రత లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అధికారులను బెదరించే ధోరణిని టీడీపీ నేతలు మానుకోవాలన్నారు. నవరత్నాల పథకాల మీద అబద్దపు ప్రచారంతో అయోమయం సృష్టించేందుకు టీడీపీ నేతలు, పచ్చ మీడియా ప్రయతి్నస్తున్నాయని వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి మండిపడ్డారు.
source : sakshi.com
Discussion about this post