జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలతో పాటు పత్రికా స్వేచ్ఛపైనా ఎన్నడూ లేనంత అత్యంత హింసాత్మక, తీవ్ర దాడి జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎందుకింత అరాచకాలకు పాల్పడుతోంది? ప్రభుత్వ, అధికార పార్టీ నాయకుల తప్పుల్ని ప్రశ్నిస్తుంటే.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఎందుకింత అక్కసు ప్రదర్శిస్తోంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం, తమ చిరునామా గల్లంతై పోతోందనే ఆందోళనతోనే ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని రాజకీయవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో జర్నలిస్టులపై, పత్రికలపై దాడులు జరగలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల వారు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలున్నాయి. కానీ, అధికార పార్టీయే ప్రభుత్వ ప్రాయోజిత హింసను ప్రేరేపిస్తూ విలేకరులపై హత్యాయత్నాలకు ఒడిగట్టడం, పత్రికా కార్యాలయాలపై రాళ్ల దాడులు చేయించడం వంటి ఫ్యాక్షన్ సంస్కృతి మునుపెన్నడూ లేదు. తునిలో ఏకంగా ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిని చంపేశారు. క్షేత్రస్థాయిలో విలేకరులకు రోజూ అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులకు లెక్కేలేదు. వైకాపా హింసాత్మక ధోరణికి, వారి అరాచక సంస్కృతికి, రాష్ట్రాన్ని గూండారాజ్‌లా మార్చేస్తున్న తీరుకు ఈ ఘటనలన్నీ అద్దం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ప్రభుత్వ ప్రాయోజిత హింసను అడ్డుకోకపోతే, పత్రికా స్వేచ్ఛ అనే మాట మరిచిపోవాల్సిందే. దానికి పెనుప్రమాదం ముంచుకొచ్చినట్లే.
ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా.. ఇలాంటి అరాచక దాడులను ఖండిస్తారు. దౌర్జన్యాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ ఏపీలో ఘనత వహించిన జగన్‌మోహన్‌రెడ్డే ప్రతిపక్షాలు, పత్రికలు, విలేకరులపై దాడులకు తన పార్టీ శ్రేణుల్ని పురిగొల్పుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలే అందుకు కారణమవుతున్నాయని చెబుతున్నాయి. మొన్నటికి మొన్న జగన్.. సిద్ధం సభలో తన చొక్కా చేతులు మడత పెడుతూ ‘చంద్రబాబును మడత వేయటానికి సిద్ధంగా ఉన్నారా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే కథనాలపై విలేకరుల సమావేశాలు పెట్టి మరీ తిట్టాలంటూ ఆదేశించారు. వైకాపా శ్రేణులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులకు పాల్పడిన సందర్భంలో ‘నాపై వ్యాఖ్యలు చేస్తే నా అభిమానులకు బీపీ పెరగదా?’ అంటూ దాడుల్ని సమర్థిస్తూ, కారకులను వెనకేసుకొస్తూ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ జగన్‌ది ఇదే ధోరణి. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబునుద్దేశించి ‘నడిరోడ్డు మీద ఉరి వేయండి, నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు’ అంటూ మాట్లాడారు. ‘చంద్రబాబును చెప్పులతో కొట్టండి, చీపుర్లతో కొట్టండి’ అని తన పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి మరింత పెచ్చరిల్లినట్లు తాజా ఉదంతాలు చాటుతున్నాయి.
మొన్న అమరావతిలో..
ఇసుక అక్రమ తవ్వకాలకు తెగబడుతున్న అధికార పార్టీ నాయకుల బాగోతాన్ని బయటపెట్టేందుకు వెళ్లిన న్యూస్‌టుడే విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావుపై వైకాపా మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. అతణ్ని అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామంటూ హెచ్చరించాయి.
నిన్న రాప్తాడులో..
వైకాపా నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న జనాల ఫొటోలు తీస్తున్నందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటో జర్నలిస్టు శ్రీకృష్ణపై వైకాపా శ్రేణులు జెండా కర్రలతో దాడికి తెగబడ్డాయి. వెంటాడి వెంటాడి మరీ కొడుతూ, కిందపడేసి కాలితో తొక్కుతూ, తన్నుతూ అతణ్ని చంపేందుకు యత్నించాయి.
ఇప్పుడు కర్నూలులో..
అరాచక శక్తిగా మారిన వైకాపా సీనియర్ నేత అక్రమాలు, అవినీతిని కళ్లకు కట్టేలా కథనం ప్రచురించినందుకు.. ‘కాటసాని రాంభూపాల్‌రెడ్డికి జై’ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన వందల మంది వైకాపా మూకలు కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. రాళ్లు విసిరి విధ్వంసానికి పాల్పడ్డాయి. కార్యాలయం లోపలికి చొరబడేందుకు యత్నిస్తూ బీభత్సం సృష్టించాయి.
source : eenadu.net
Discussion about this post