పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్సార్‌సీసీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని, ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కంటి కనుబోమ్మకు తగిలి, పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి కంటికి తగిలిందన్నారు. సీఎం జగన్‌కు కొద్దిగా కింద కణతకు తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం జరిగేదని చెప్పారు.
ఇదంతా డ్రామా అంటున్న పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో బొండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బొండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగునవ ఉన్న వాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందన్నారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండి ఉండాలని, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని అన్నారు.
source :sakshi.com
Discussion about this post