ఎవరెన్ని చెప్పినా.. మేం మారమంతే.. అన్నట్లుంది వైకాపా నాయకుల తీరు. ఎన్నికల విధులు, ఏర్పాట్లలో వాలంటీర్లు పాల్గొనవద్దని ప్రభుత్వం, నాయస్థానాలు చెప్పినా.. వారు మాత్రం మారడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మేజరు పంచాయతీ కార్యాలయంలో వైకాపా నాయకుడితోపాటు వాలంటీర్లు ఓటరు జాబితాలను పరిశీలిస్తున్నారు. ఈ దృశ్యాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించడంతో అక్కడి నుంచి జారుకున్నారు. శనివారం మధ్యాహ్నం వైకాపాకు చెందిన ఎంపీటీసీ-1 సభ్యుడు గొడ్డాల్ రఫీ పంచాయతీ జూనియర్ అసిస్టెంటు కుర్చీలో కూర్చుని వాలంటీర్లతో ఓటరు జాబితాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. గ్రామ సచివాలయం-1 ఉద్యోగులు వాలంటీర్లను పిలిపించి వైకాపా ప్రజాప్రతినిధి దగ్గరకు పంపారు. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి మందలించడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సచివాలయం-1లో సమావేశమవడం గమనార్హం. చర్యలు తీసుకోవాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.
source : eenadu.net
Discussion about this post