ఊసరవెల్లి తన భద్రత కోసం రంగులు మారుస్తుంది. జగన్ మాత్రం ప్రజలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు అనుక్షణం ఒక కొత్త రంగు పులుముకుంటూనే ఉంటారు. గత పాలకులపై అక్కసు తలకెక్కించుకుని కక్షపూరిత చర్యలతో ఆంధ్రావనిలో పల్లె.. పట్టుగొమ్మలను నరికేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను అపహాస్యం చేశారు. పంచాయతీ పాలనకు పాతరేశారు. సర్పంచులు, కార్యదర్శుల అధికారాలకు కోతేసి.. ప్రకటనలతో పూతేసి.. పంచాయతీ ఖజానాలను కాజేసి.. పల్లెలు ఘొల్లుమనేలా ప్రగతిని దూరం చేశారు.
గోడ కట్టినట్లు అబద్ధాలాడటంలో అప్రకటిత గోల్డ్ మెడలిస్ట్ జగన్. ఆ ప్రతిభను ప్రదర్శిస్తూ 2019లో గ్రామ సచివాలయాల వ్యవస్థను తెరపైకి తెచ్చారాయన. పంచాయతీల పర్యవేక్షణలోనే అది పని చేస్తుందని మొదట్లో అందరినీ నమ్మించారు. 2021లో పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే తెప్ప తగలేశారు జగన్. సచివాలయాలపై నియంత్రణాధికారాన్ని సర్పంచ్‌ల చేతుల్లోంచి తీసేశారు. వాటిపై పర్యవేక్షణకు ప్రత్యేక శాఖను సృష్టించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి అవి అదనపు ఆయుధాలు’’ అని హైకోర్టుకు సమర్పించిన ఓ ప్రమాణపత్రంలో జగన్ సర్కారు లోగుట్టు బయటపెట్టేసింది. తమ ఊరికి కావాల్సిందేమిటో స్థానికులందరూ చర్చించుకుని, గ్రామసభల్లో ఒక నిర్ణయం తీసుకుని, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఆ పనులు జరిపించుకునే వాతావరణాన్ని జగన్ ఛిద్రంచేశారు. సర్పంచ్‌లను కూరలో కరివేపాకుల్లా తీసిపారేస్తూ- సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక తదితరాలన్నింటినీ సచివాలయాలకు అప్పగించారు. అలా తన గుప్పిట్లో ఉండే సచివాలయాలతో స్థానిక ప్రభుత్వాలకు మరణశాసనం రాశారు జగన్. పంచాయతీరాజ్ లక్ష్యాలకు భిన్నంగా అధికారాన్ని కేంద్రీకరించారు. తన ఆజ్ఞ లేనిదే రాష్ట్రంలో చీమైనా చిటుక్కుమనరాదనే స్థాయిలో నిరంకుశ రాజ్యాన్ని స్థాపించారు.
ఆగమాగమైన పల్లెలు
మురుగు కాల్వలను శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. తాగునీటి పైప్‌లైన్ల రిపేర్లకు పైసల్లేవు. రహదారులకు చిన్నపాటి మరమ్మతులు చేయించడం మొదలు చెరువుల్లో చెత్త తొలగింపు దాకా అన్నిటికీ కాసుల కటకటే. ఏ పని చేయడానికి కూడా సర్పంచ్‌ల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగ్‌లకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. పల్లెపట్టుల్లో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి సచివాలయాలతో అద్భుతాలు చేస్తున్నామంటూ జగన్ జబ్బలు చరుచుకున్నారు. అంతకు ముందు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవారు. జగన్ వచ్చాక వాటికీ టెండర్ పెట్టారు. పంచాయతీ ఎన్నికలు పూర్తికాక మునుపే ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి మరీ ఆ సొమ్ములకు కాళ్లు తెప్పించారు. పల్లెల అవసరాలను పట్టించుకోకుండా సచివాలయాల నిర్మాణం వంటి సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ‘ఉపాధి’ నిధులను ధారపోయించారు. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచ్‌లు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్ వినిపించుకోలేదు. మిమ్మల్ని నమ్మిన పాపానికి నిండా ముంచారని వైకాపా సర్పంచ్‌లూ ఆందోళన బాటపట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. అవమానాలను తట్టుకోలేక రోడ్డెక్కి నిరసనలు తెలిపితే- పోలీసులను ఉసిగొల్పి హాయిగా వేడుక చూశారు జగన్. చేసిన పనులకు బిల్లులు రాక బలవన్మరణాలే దిక్కు అనుకునేంతగా పల్లె ప్రజాప్రతినిధులకు నరకం చూపించారాయన.
రాష్ట్రంలోని పంచాయతీల సంఖ్య 13వేలకు పైమాటే. ఏపీ జనాభాలో డెభ్భై శాతానికి పైగా(సుమారు 3.80 కోట్ల మంది) గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పల్లెలపై పగబట్టినట్లు ప్రవర్తించిన జగన్- అంతమంది జీవితాలనూ దుర్భరంగా మార్చేశారు. ఏవో కొన్ని మేజర్ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెల ప్రగతికి చేయూతనివ్వాల్సిన జగన్- ఆ పని చేయలేదు. కానీ, పంచాయతీలకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ ‘హాంఫట్’ అనిపించారు. విద్యుత్ బకాయిలను తీర్చడం కోసమంటూ రూ.1597 కోట్లును అలా దారి తప్పించారు. ఆర్థిక సంఘం నిధులతో కరెంట్ బాకీలను తీర్చేందుకు కేంద్రం అనుమతిచ్చిందని జగన్ సర్కారు అడ్డంగా బుకాయించింది. వాస్తవానికి ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పదిశాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కానీ, జగన్ సర్కారు మాత్రం సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. చట్టాలను చాపచుట్టడంలో చెయ్యితిరిగిన జగన్- పంచాయతీల సొమ్ము మళ్లింపులోనూ అంతే అరాచకంగా వ్యవహరించారు. దానిపై దిల్లీకి ఫిర్యాదులు వెళ్లడంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉపకార్యదర్శి నిరుడు సెప్టెంబరులో ఇక్కడకు వచ్చి విచారించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులను సర్పంచ్‌లకు తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి పనులకు ఉపయోగపడాల్సిన సొమ్మును కాజేసిన జగన్- పల్లెల్లో అధ్వాన పరిస్థితులకు ఆజ్యంపోశారు. పంచాయతీల్లోంచి పట్టుకుపోయిన డబ్బును డిస్కమ్‌లకు నిజంగానే జమేశారా అంటే- అదీ తెలియదు. ప్రశ్నించిన వారిని అమ్మనాబూతులు తిట్టడమే తప్ప ప్రజలకు నిజానిజాలు చెప్పే ధైర్యం జగన్ సర్కారుకు లేదు.
source : eenadu.net
Discussion about this post