షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఇండియన్ నేవీ 254 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అవివాహితులు అప్లై చేసుకోవచ్చు. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ అర్హతలు. అకడమిక్ మార్కుల మెరిట్ను బట్టి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభను బట్టి శిక్షణలోకి తీసుకుంటారు. తర్వాత రూ. లక్ష వరకూ జీతం అందుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 10. మరిన్ని వివరాలు.. https://www .joinindiannavy.gov.in/లో చూడండి.
నేవీలో అధికారిగా కొలువుదీరే అవకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి అవివాహిత మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు. అకడమిక్ మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో మెరిసిన వారిని శిక్షణలోకి తీసుకుంటారు. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరు ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు పొందవచ్చు.
ఈ పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచీల్లో ఉన్నాయి. ఇవన్నీ లెవెల్-10 హోదా ఉద్యోగాలే. ఈ పోస్టులకు రాత పరీక్షలు లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశమే. దరఖాస్తు చేసుకున్నవారిని అకడమిక్ ప్రతిభతో వడపోస్తారు. అందువల్ల యూజీ/పీజీలో ఎక్కువ మార్కులు పొందినవారు విజేతలు కావడానికి అవకాశాలెక్కువ. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇవి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో విజయవంతులైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, తుది నియామకానికి ఖరారు చేస్తారు.
వీరికి నేవల్ అకాడెమీ, ఎజిమాళలో జనవరి, 2025 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో మూల వేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. ప్రొబేషన్ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. ఈ పోస్టులు పరిమిత కాల ప్రాతిపదికన (షార్ట్ సర్వీస్ కమిషన్) ఉంటాయి. ఎంపికైనవారు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు. అందువల్ల గరిష్ఠంగా 14 ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఆ తర్వాత విధుల నుంచి వైదొలగాలి. నేవీలో పని అనుభవంతో వీరు సులువుగానే ఇతర ఉద్యోగాలు పొందగలరు.
వయసు: పోస్టు ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2, 2000 – జనవరి 1, 2004/2005/2006 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పై అన్ని పోస్టులకూ ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ ఉన్నవారికి అకడమిక్ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టులవారీ ప్రాధాన్యం తెలపడం తప్పనిసరి.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా. పైలట్, అబ్జర్వర్ పోస్టులకు మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు రాత పరీక్షలు లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. ప్రొబేషన్ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచి
జనరల్ సర్వీస్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 15 మహిళలకు కేటాయించారు. ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 8, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 18, పైలట్ 20 ఖాళీలకు బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్ 30 ఖాళీలకు ఎందులోనైనా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ (ఐటీ)/ ఎంసీఏ లేదా బీఎస్సీ/ బీకాంతోపాటు లాజిస్టిక్స్/ సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. ఈ విభాగంలో 9 పోస్టులు మహిళలకు దక్కుతాయి.
నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టర్ క్యాడర్‌లో 10 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్, పది, ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. వీటికి పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం.
ఎడ్యుకేషన్ బ్రాంచి
ఇందులో అన్ని విభాగాల్లోనూ కలిపి 18 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం
టెక్నికల్ బ్రాంచి
ఇంజినీరింగ్ బ్రాంచ్ 30 (వీటిలో మహిళలకు 9), ఎలక్ట్రికల్ బ్రాంచ్ 50 (మహిళలకు 15), నావల్ కన్‌స్ట్రక్టర్ 20 (పురుషులు, మహిళలు ఇద్దరికీ) ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Discussion about this post