జగనన్న కాలనీల్లో స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉరవకొండలో పది రోజులకు పైగా కొనసాగుతోంది. ముందు దీనిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టగా అక్కడ సాధారణ రిజిస్ట్రేషన్లకు అంతరాయం కలుగడంతో దానిని మండల పరిషత్ కార్యాలయానికి మార్చారు. అక్కడ గ్రామ సచివాలయాల వారీగా సిబ్బంది కంప్యూటర్లను ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నారు. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ఒత్తిడి అధికారులపై ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా లబ్ధిదారులు ఎక్కువ మంది తరలివస్తున్నారు. అదీ వేకువ జామునే వచ్చి తమ వంతు కోసం వేచి ఉంటున్నారు. వారి సంఖ్య అనుగుణంగా ఏర్పాట్లు లేక పోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. కార్యాలయం బయట వేచి ఉండడానికి చిన్నపాటి షామియానా ఏర్పాటు చేశారు. అది వారికి చాలడం లేదు. ఆ కార్యాలయ ప్రాంగణంలో చెట్ల కింద నిరీక్షిస్తూ తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. పట్టణంలో 3,200 మందికి పైగా స్థలాలను పంపిణీ చేయగా ఇప్పటి వరకు 1,000 మంది స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అన్ని సవ్యంగా సాగితే ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకు 500 మంది లబ్ధిదారుల వివరాలు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది.
source : eenadu.net
Discussion about this post