కూటి కోసం కోటి పాట్లు అన్నది లోకోక్తి! ఉనికి కోసం ఆర్థిక నేరాలు అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు యుక్తి! అధికారంలో ఉండగా రాజధాని పేరుతో రైతుల భూములను సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల కోసం మళ్లీ ఆర్థిక నేరగాళ్లనే ఆశ్రయిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న ఆయన… ఉనికి చాటుకునేందుకు యధావిధిగా డబ్బు కట్టలనే నమ్ముకున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి ఆర్థికంగా బలవంతులైన ఎన్నారైలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లను ఎన్నికల బరిలోకి దింపేందుకు గాలం వేస్తున్నారు.
వీళ్లిచ్చే డబ్బుతో పాటు ఎన్నికల్లో వెదజల్లేందుకు తన చుట్టూ ఉన్న ఆర్థిక నేరగాళ్లకు కూడా నిధులు సమీకరించే పని పురమాయించారు. అధిక వడ్డీల ఆశచూపి సామాన్యుల నుంచి డబ్బులు సమీకరించటం, బ్యాంకులను బురిడీ కొట్టించటం, లేని కంపెనీలను సృష్టించి మరీ రుణాలు తెచ్చి ఎగవేయటం వంటి కళల్లో సిద్ధహస్తులైన బాబు ముఠా మళ్లీ ఆ పనిలో పడ్డారు. దీన్లో భాగంగా అధిక వడ్డీల ఎర వేసి అప్పుల రూపంలో డబ్బులు సేకరించే బాధ్యత తన బినామీ అయిన మాజీ మంత్రి నారాయణకు అప్పగించారు. ఇక ఎడాపెడా రుణాలు తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన చరిత్ర సుజనా చౌదరిది. దాదాపు 10వేల కోట్లకుపైగా వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనాను అరెస్టు చేస్తారన్న భయంతోనే 2019లో ఓడిపోయిన వెంటనే బీజేపీలోకి పంపారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావుదీ రుణాలు ఎగవేసిన బాపతే. వీళ్లు మళ్లీ అదే పనిలో పడ్డారని విశ్వసనీయంగా తెలియవచ్చింది.
2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ బినామీగా వ్యవహరించిన నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ.. అధిక వడ్డీల ఆశ చూపిస్తూ భారీ ఎత్తున రుణాలను సేకరించి చంద్రబాబుకు అందిస్తుంటారు. టీడీపీ హయాంలో నారాయణకు అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు ఆయనతో కలసి అమరావతి భూకుంభకోణంలో భారీ ఎత్తున దోచేశారు. అయితే ఎన్నికలు ముగిశాక అధిక మొత్తంలో అప్పులు ఇచ్చిన ఇద్దరు బడా వ్యాపారులు, మార్వాడీలకు నారాయణ టోపీ పెట్టారనే చర్చ నెల్లూరులో భారీ ఎత్తున సాగింది.
ఇప్పుడు కూడా నారాయణ తనకు అలవాటైన రీతిలో అధిక వడ్డీల ఎర వేసి వ్యాపారులు, మార్వాడీలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున రుణాలు సేకరిస్తున్నారు. నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో వారం క్రితం నాలుగు కౌంటర్లు తెరిచి నూటికి 5 రూపాయల వడ్డీ ఆశ చూపించి… (అంటే ఏడాదికి 60 శాతం) వ్యాపారులు, మార్వాడీల నుంచి దాదాపు రూ.650 కోట్లు సమీకరించారని సమాచారం. దీన్ని రహస్య ప్రాంతానికి తరలించిన నారాయణ… అక్కడి నుంచి చంద్రబాబు సూచించిన స్థావరాలకు చేరవేయడంలో నిమగ్నమయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
source : sakshi.com
Discussion about this post