సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గురువారం కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ నుంచి అక్కడక్కడ వారి బంధువుల ద్వారా నామినేషన్లు దాఖలు పరిచారు. అనంత లోక్‌సభకు ఇద్దరు, ఏడు శాసనసభ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్క గుంతకల్లు నియోజకవర్గంలో బోణీ కాలేదు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి కలెక్టరేట్‌లో కలెక్టర్/ఆర్‌ఓ వినోద్‌కుమార్ నామపత్రాలను స్వీకరించారు. ఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేశ్‌రెడ్డి సహకారం అందిస్తున్నారు. తొలి రోజు ఎస్‌యూసీఐ అభ్యర్థి నాగ ముత్యాలు, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగనాథ్ గోపీనాథ్ ఒకో సెట్ నామినేషన్ వేశారు. వారి నామపత్రాలను ఏఓ అంజన్‌బాబు, ఉప తహసీల్దారు మంజుల పరిశీలించారు.
ఒక్క గుంతకల్లు నియోజకవర్గంలో ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన ఏడు శాసనసభ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్ వేశారు. ఉరవకొండ నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున కుటుంబసభ్యులు ఒక సెట్ అందజేశారు. అనంత అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ తరఫున ఒక సెట్, వైకాపా నుంచి అనంత వెంకటరామిరెడ్డి తరఫున రెండు సెట్లు, తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఒక సెట్, శింగనమల తెదేపా అభ్యర్థి బండారు శ్రావణశ్రీ ఒక సెట్, రాయదుర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎంబీ చిన్నప్పయ్య, ఎస్‌యూసీఐ అభ్యర్థి రాఘవేంద్ర, రాప్తాడు స్వతంత్ర అభ్యర్థి సాకే రాజేశ్‌కుమార్, కళ్యాణదుర్గం స్వతంత్ర అభ్యర్థి రంగనాథ్ గోపీనాథ్ ఒకో సెట్ ప్రకారం నామపత్రాలు సంబంధిత ఆర్‌ఓలకు అందజేశారు.
నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎక్కడికక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంత కలెక్టర్ కార్యాలయం వందమీటర్ల దూరం వరకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అభ్యర్థి, ఆయన తరఫున నలుగురికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం కల్పించారు. కలెక్టరేట్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలోనే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. తొలిరోజు ఎక్కడా సమస్యలు తలెత్తలేదు.

source : eenadu.net










Discussion about this post