సమాజమే శాశ్వతం. సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారా? వైకాపా గుర్తు ఫ్యానుకు మూడు రెక్కలున్నాయి. ఓటుతో వాటిని విరగ్గొట్టాలి. బాదుడే బాదుడు నినాదంతో ఉత్తరాంధ్ర వాసులు, విధ్వంసానికి వ్యతిరేకంగా రాయలసీమవారు, హింసా రాజకీయాలను నిరసిస్తూ కోస్తాంధ్ర ప్రజలు.. మూడు రెక్కలను విరగ్గొట్టి, రెక్కలు లేని ఫ్యాన్‌ను రివర్స్ సీఎంకు ఇచ్చేసి ఇంటికి పంపండి.
యువత తెదేపా-జనసేన వైపు ఉన్నందున గెలుస్తున్నాం.. ప్రస్తుత ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. భవిష్యత్తును నిర్ణయించేవి. భేషజాలు లేకుండా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయాలి. తెదేపా, జనసేన జెండాలతో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ప్రజలంతా అప్రమత్తం కావాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. పాలనను గాడిలో పెట్టాలి అని చంద్రబాబు అన్నారు
ఐటీని ప్రోత్సహిస్తూ కంపెనీలు తెచ్చి అభివృద్ధికి బాటలు వేసిన తనది విజన్, రూ.5 వేలకు వాలంటీరు ఉద్యోగం, మటన్‌కొట్లు అంటూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్‌రెడ్డి ఆలోచనలు పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం క్వారీ వద్ద నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. ‘ఇది నామార్క్ పాలన అంటూ జగన్ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఊహించనట్లుగా విద్యుత్తు ఛార్జీల పెంపు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా పెట్రో ధరలు, నిరుద్యోగిత 24 శాతం, ఉద్యోగాలంటూ మోసం, ఉచితంగా దొరికే ఇసుకను కిలోల లెక్కన అమ్మడం, దళితులపై దాడులు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం.. ఇవన్నీ జగన్ మార్క్ పాలనా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
‘తెదేపా హయాంలో 11 డీఎస్సీల ద్వారా లక్షన్నర మందికి ఉద్యోగాలు, విదేశీ విద్యకు సాయం, డ్వాక్రాసంఘాల పొదుపు ఉద్యమం, విమానాశ్రయాలు, టెలికాం, జాతీయ రహదారులు, దళిత బిడ్డ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిగా ఎన్నుకునేప్పుడు క్రియాశీలంగా వ్యవహరించడం, సైబరాబాద్ నిర్మాణం, కియా, పట్టిసీమ, పోలవరం, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడడం, కాపు, మైనారిటీలకు ఉపకార వేతనాలు.. ఇవన్నీ తెదేపా మార్కు పాలనకు నిదర్శనాలు’ అని వెల్లడించారు. జగన్ పాలనను మా పాలనతో పోల్చుకోవాలన్నారు. ‘72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ప్రపంచ చరిత్రలో 35 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అలాంటి అమరావతికి కులం రంగు పూసి మూడు రాజధానులంటూ నాశనం చేశారు’ అని ఆరోపించారు.
source : eenadu.net
Discussion about this post