మోసం..! పదే పదే అదే మోసం..! అయిదు కోట్ల ఆంధ్రుల్ని పదేళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది..! కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ… ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడటం… తీరా బడ్జెట్ చూశాక ఉసూరుమనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది.
మోసం..! పదే పదే అదే మోసం..! అయిదు కోట్ల ఆంధ్రుల్ని పదేళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది..! కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ… ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడటం… తీరా బడ్జెట్ చూశాక ఉసూరుమనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది. విభజన జరిగి దాదాపు పదేళ్లయిపోయింది. కేంద్రంలో రెండోదఫా ఎన్‌డీఏ ప్రభుత్వం గడువూ త్వరలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టిమాటలుగానే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్‌లోనూ విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మొండిచెయ్యే చూపింది. కానీ కేంద్రప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడమే అలవాటుగా మారిన జగన్ ప్రభుత్వం.. ఎప్పటిలానే కిమ్మనడం లేదు! ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రిలో ఏ కోశానా లేవు. 2019 ఎన్నికలకు ముందు విపక్షనేతగా కేంద్రంపై రంకెలు వేసిన జగన్… అధికారంలోకి వచ్చాక పిల్లిలా తోకముడిచారు.
తనపై నమోదైన అవినీతి కేసుల్లోంచి బయట పడటమే ఆయన ఏకైక ఎజెండా..! విభజన హామీలపై ఈ అయిదేళ్లలో ఆయన సీరియస్‌గా ఒక్కసారీ సమీక్షించిన దాఖలాల్లేవు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తానని బీరాలు పలికారు. ఎన్నికలకు పది నెలల ముందే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. విభజన హామీల సాధనకు ఎంతవరకైనా వెళతామన్నట్టుగా ప్రజల్లో భ్రమ కల్పించారు. అదే నిజమనుకుని ప్రజలు ఓట్లేశారు. కానీ అధికారంలోకి రాగానే జగన్ ప్లేటు ఫిరాయించేశారు. తూచ్… కేంద్రంతో పోరాటం లేదంటూ కాడి దించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలసి బయటకు వచ్చాక… ‘‘రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలూ ప్రధాని విన్నారు. ఆయన సానుకూలంగా ఉంటారనుకుంటున్నాను. మనసులో ఉంటే చేస్తారు. ఎన్‌డీఏ 250 స్థానాలకు పరిమితమైతే పరిస్థితి మరోలా ఉండేదేమో…! 250 దాటకూడదని దేవుడిని నేనూ ప్రార్థించా.
ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడితే హోదాపై సంతకం పెట్టాకే ప్రమాణస్వీకారం చేసే పరిస్థితి వచ్చేది. ఏం చేస్తాం, మన కర్మ అనుకోవాలి! వాళ్లకి మన సాయం లేకుండానే బలంగా ఉన్నారు. ఇప్పుడు సంతకం పెడతారా? అంటే ప్రయత్నిస్తూ పోవాలి’’… ఇలా జగన్ చేతులెత్తేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు అవే నేలచూపులు… బేల అరుపులు తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీసే సాహసం జగన్ ఎప్పుడూ చేయలేదు. ఇది నయవంచన కాదా? 2014-19 మధ్య కూడా కేంద్రంలో ఎన్‌డీఏకి 250 స్థానాలకు మించే బలముంది కదా? రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామా చేస్తే… కేంద్రం దిగి వస్తుందని అప్పుడెందుకు చెప్పారు? ఆ పని ఈ అయిదేళ్లలో ఎందుకు చేయలేదు?
ప్రత్యేక హోదాకు పాతర
ఆంధ్రప్రదేశ్ అయిదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీకి విజయవంతంగా పాతరేశారు. 14వ ఆర్థికసంఘం సిఫారసులను సాకుగా చూపి, ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని, అప్పటికే ఉన్న రాష్ట్రాలకూ పొడిగించబోమని మోదీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కొన్నాళ్ల తర్వాత అప్పటికే ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు పొడిగించింది. ఏపీకి మాత్రం మొండిచెయ్యి చూపింది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని ఎన్నికల ముందు డబ్బాకొట్టిన జగన్… ఈ అయిదేళ్లలో కేంద్రాన్ని ఒక్కసారీ నిలదీయలేదు.
Source : eenadu.net
Discussion about this post