ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దామని సీఎం జగన్ పలు వేదికలపై వల్లె వేస్తుంటారు. నాడు-నేడు పథకంతో పెనుమార్పులు తెచ్చామని గొప్పలు చెబుతుంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గుంతకల్లు మండలం కసాపురంలోని ప్రాధమిక ఉన్నత పాఠశాలలో రెండో విడత చేపట్టిన నాడు-నేడు పనులకు నిధులు విడుదల చేయక నిర్మాణాలు పూర్తి కాలేదు. సరిపడా తరగతి గదులు లేకపోవడంతో అసంపూర్తి భవనంలోనే విద్యార్థులను కూర్చోబెట్టి బోధించాల్సి వస్తోంది. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 326 మంది చదువుకుంటున్నారు. నాడు-నేడు కింద ఏడు గదులు నిర్మాణానికి రూ.84 లక్షలు మంజూరు చేశారు. రూ.14 లక్షలు విడుదల కాలేదని గుత్తేదారు పనులను మూడు నెలలుగా ఆపేశారు. దీంతో ఏడో తరగతిలో ఏ, బీ సెక్షన్ల విద్యార్థులు పూర్తికాని గదుల్లో పాఠాలు వినడానికి నానా తంటాలు పడుతున్నారు.ఈ విషయంగా మండల ఇంజినీర్ఓబులేశు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఏడు గదుల నిర్మాణానికి రూ.1.08 కోట్లు కేటాయించగా.. మళ్లీ కుదించి రూ.84 లక్షలు మంజూరు చేసింది. ఆఖరి విడత నిధులు రావాల్సివుందన్నారు. బిల్లులు అందగానే పనులు పూర్తి చేస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post