గత నాలుగున్నరేళ్లుగా విస్తారమైన వర్షాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగి ఉమ్మడి జిల్లా పరిధిలో వాల్టా చట్టం పరిధిలోని గ్రామాల సంఖ్య పూర్తిగా తగ్గింది. 2014–2018 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఒకానొక సమయంలో జిల్లా సగటు నీటి మట్టం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 27 మీటర్లకు పతనం కావడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు చంద్రబాబు పాలించిన ఐదేళ్లూ సగటు నీటి మట్టం 18 నుంచి 27 మీటర్ల మధ్య నమోదవుతూ వచ్చింది. ఇందులో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 60 నుంచి 90 మీటర్ల అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. దీంతో అప్పట్లో వాల్టా గ్రామాల సంఖ్య 400 నుంచి 500 వరకు చేరుకుంది. వాల్టా పరిధి ప్రకటించిన గ్రామాల్లో వ్యవసాయానికి కొత్తగా బోరుబావులు తవ్వడానికి వీలులేదు. అలాగే ఇసుక తవ్వకం, మైనింగ్ లాంటి వాటికీ అనుమతులు ఉండవు. ఏదైనా అత్యవసరమయితే తాగునీటి అవసరాలకు మాత్రమే ఉన్నతాధికారుల అనుమతితో బోర్లు వేయడానికి వెసులుబాటు ఉండేది.
2018లో 475 గ్రామాల్లో ‘వాల్టా’
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లూ వరుణుడు పూర్తీగా మొహం చాటేయడంతో వాల్టా గ్రామాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2018లో ఉమ్మడి జిల్లా పరిధిలోని 44 మండలాల పరిధిలో ఏకంగా 475 గ్రామాలు వాల్టా పరిధిలోకి చేర్చారు. అంటే అప్పట్లో డేంజర్‌జోన్ జాబితాలో 44 మండలాలు చేరాయి. 2017–18 మినహా అంతకు ముందు నాలుగేళ్లూ సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భజలాలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఈ క్రమంలో వాల్టా గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కొత్తగా బోర్లు వేసినా 90 శాతం నీటి చుక్క కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయంలో రైతులు బాగా నష్టపోయారు. ఓవరాల్‌గా చంద్రబాబు ఐదేళ్ల హయాంలో వాల్టా గ్రామాల సంఖ్య 350 నుంచి 500 వరకు నమోదు కావడం గమనార్హం. ఈ వ్యత్యాసాన్ని గమనించిన రైతులు ‘బాబు హయాం… కరువుకు నిలయం’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
2019 నుంచి తగ్గుముఖం
2019 మే నెలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2019 ఆగస్టు నుంచి వరుణుడు కరుణించడంతో భారీ వర్షాలు మొదలయ్యాయి. అలా నాలుగేళ్లూ కరువు తీరేలా వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా 2019లో 551 మి.మీ, 2020లో 846 మి.మీ, 2021లో 555 మి.మీ, 2022లో 770 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 2019 మే నెలలో 27 మీటర్లలో ఉన్న భూగర్భజలమట్టం 2019 డిసెంబర్ నాటికి 18 మీటర్లకు చేరుకున్నాయి. అలా క్రమక్రమంగా ౖపైపెకి రావడంతో 2022 నాటికి 6 మీటర్లకు చేరుకోవడం విశేషం. ఎటు చూసినా జలసిరి సంతరించుకుంది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో 2019లో వాల్టా గ్రామాల సంఖ్య 375 గ్రామాలు ఉండగా 2020 నాటికి 266 గ్రామాలకు తగ్గింది. అలాగే 2021లో 131 గ్రామాలు, 2022లో 75 గ్రామాలకు… తాజాగా ప్రకటించిన జాబితాలో 48 గ్రామాలకు చేరుకుంది. ఇందులో అనంతపురం జిల్లాలో కేవలం రెండు మండలాల పరిధిలో ఆరు గ్రామాలు ఉండగా, శ్రీసత్యసాయి జిల్లాలో 10 మండలాల పరిధిలో 42 గ్రామాలను చేర్చారు. చంద్రబాబు హయాంలో దుర్భిక్షం, కరువు పరిస్థితులు కారణంగా వాల్టా గ్రామాలు పెరిగిపోగా… గత నాలుగున్నర ఏళ్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విస్తారంగా వర్షాలు కురిసి వాల్టా గ్రామాల సంఖ్య భారీగా తగ్గిపోవడం గమనార్హం.
source : sakshi.com
Discussion about this post