ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టుల పనులను నిలిపివేసి రాయలసీమ గొంతు కోసిన జగన్… ఏ మొహం పెట్టుకుని సిద్ధం సభకు వస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభ కోసం ట్రాఫిక్ మళ్లింపుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. గతంలో ఎన్నడూ ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదన్నారు. వైకాపా అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఒకరోజు ముందే రాయలసీమ జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు, పాఠశాలల బస్సులను సమీకరించారు. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆదివారం సైతం ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. జగన్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేయడాన్ని తెదేపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఐదేళ్లుగా హంద్రీనీవా పనులను ఆటకెక్కించారని చెప్పడానికే వస్తున్నావా అంటూ నిలదీశారు. జీడిపల్లి, బీటీపీ, పేరూరు, తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ, ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉరవకొండలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామూహిక బిందుసేద్యం పథకాలను మూలకు చేర్చి.. జిల్లా భవిషత్తును సర్వనాశనం చేశానని చెబుతావా అంటూ ప్రశ్నించారు. అనంత రైతులను మోసగించిన జగన్‌కు జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు.
source : eenadu.net
Discussion about this post