తనను హతమారుస్తానని వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత శుక్రవారం సైబరాబాద్ సైబర్‌క్రైం డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి…
‘‘మా కుటుంబసభ్యులు రాజకీయాల్లో ఉన్నా నేను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను. కొంతకాలంగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి నా ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో నాతోపాటు మా సోదరి వైఎస్ షర్మిల, పెద్దమ్మ వైఎస్ విజయమ్మలపై అసభ్య పదజాలంతో ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెడుతున్నాడు. గత నెల 29న వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో మా సోదరి వైఎస్ షర్మిలను కలిశాను. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. అదేరోజు రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్ ఎకౌంట్ పేజీలో.. ‘‘ఇందుకే పెద్దలన్నారు.. శత్రుశేషం ఉండకూడదని, లేపేయ్ అన్నా ఇద్దరినీ, ఈ ఎన్నికలకు పనికి వస్తారు’’ అని పోస్టు చేశాడు. అదే పోస్టులో నేను, షర్మిల కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకం వద్దకు వెళ్లిన వీడియోనూ పోస్టు చేశాడు. నా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కోర్టులో పోరాడుతున్నాను. గతంలో ఇలాగే బెదిరింపులు రాగా పోలీసులు, సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. అతడి ఫేస్‌బుక్ పేజీని పరిశీలించగా మా ముగ్గురినీ అత్యంత హేయమైన పదాలతో దూషిస్తూ పోస్టులున్నాయి. వైఎస్ విజయమ్మపై మరింత దారుణమైన పదాలు వినియోగించాడు. షర్మిలపైనా అలాంటి పదాలతోనే గౌరవానికి భంగం కలిగేలా పోస్టులు పెట్టాడు. వర్రా రవీంద్రారెడ్డి పాత నిందితుడని తెలిసింది. మహిళలను అసభ్యంగా దూషించడంపై అతడిపై అనేక ఫిర్యాదులున్నాయి. ఇంత జరుగుతున్నా ఏపీలో వైకాపాతో సాన్నిహిత్యం వల్ల అక్కడి ప్రభుత్వం అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్వ్యూల్లో మమ్మల్ని అప్రతిష్ఠ పాలు చేస్తున్నాడు’’ అని సునీత వివరించారు.
మానసికంగా దెబ్బతీయడానికే…
రానున్న ఎన్నికల్లో షర్మిల, సునీత వైయస్‌ఆర్ జిల్లాలో పోటీచేయకుండా మానసికంగా దెబ్బకొట్టేందుకు వైకాపా సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిత్వ హననం చేసేలా దాడులు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. తన పేరుతో ఎవరో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచారని వర్రా రవీంద్రారెడ్డి పులివెందుల పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడం గమనార్హం! ఈ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం కూడా వివేకా హత్యపై సీఎం జగన్‌కు, ఎంపీ అవినాష్‌రెడ్డికి మద్దతుగా… సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు.
source : eenadu.net
Discussion about this post