ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటున్నారే.. ఎందుకు సిద్ధం.. దగా చేయడానికి సిద్ధమా? ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారంటూ.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నగరిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. పట్టణంలోని ఓంశక్తి ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో టవర్‌క్లాక్ వద్దకు చేరగానే రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆపై మాట్లాడారు. ‘నగరిలో ఎవరయ్యా ఎమ్మెల్యే అని ప్రశ్నించి.. ఎమ్మెల్యే కాదు మంత్రి అట కదా, ఒకరా నలుగురా?.. మంత్రి రోజాతో పాటు ఆమె భర్త, ఇద్దరు అన్నదమ్ములూ మంత్రులుగా వ్యవహరిస్తూ జబర్దస్తుగా దోచేస్తున్నారట.. ఇసుక, మట్టి, ఏదీ వదలటం లేదట.. నాలుగేళ్లలో నగరి- గాలేరుకు ఒక్క రూపాయి ఖర్చు చేశారా? అంటూ విమర్శలు గుప్పించారు.
జిల్లాలో చెరకు రైతులకు బకాయిలు ఇప్పించలేకున్నారు. మరమగ్గం కార్మికులకు విద్యుత్తు ఛార్జీల సమస్య పరిష్కరించలేదు. ఒక మహిళా మంత్రిగా ఉండి అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు సమ్మె చేస్తే పోలీసుల బూటు కాళ్లతో తొక్కించారు’ అంటూ మండిపడ్డారు.
source : eenadu.net
Discussion about this post