ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రూ.10 వేలు విలువకు మించిన ఆభరణాలు, వస్తువులు, 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషిద్ధం. రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్ల వద్ద రూ.లక్షకు మించి డబ్బు ఉండకూడదు. ఎన్నికల నియమావళి జూన్ 5 వరకు అమల్లో ఉంటుంది. ఈ తరుణంలో పౌరులు తమ అవసరాల నిమిత్తం నగదు, బంగారం తమ వెంట తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చినపుడు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకెళ్లినా అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తారు.
రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాల్సి వస్తే.. ఆధారాలు, పత్రాలు వెంట తీసుకెళ్లాలి. పోలీసులు ఈ ఆధారాలతో సంతృప్తి చెందకపోతే.. వాటిని ఆదాయ పన్నుశాఖకు అప్పగిస్తారు. అక్కడ ఆధారాలు చూపించి, తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నుశాఖ అడిగిన పత్రాలు ఇవ్వకుంటే 20 నుంచి 30 శాతం వరకు మినహాయించుకుని డబ్బులు తిరిగి ఇస్తారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చినపుడు.. విత్‌డ్రా చేసిన రసీదు, సదరు ఖాతాకు లింక్ అయిన ఫోన్ నంబరుకు వచ్చిన సంక్షిప్త సందేశం ఉండాలి. డబ్బు ఎవరికి చెల్లించేందుకు తీసుకెళ్తున్నారో ఇన్‌వాయిస్ పత్రం తప్పనిసరి.
పంట విక్రయించిన రైతులు కూడా.. అమ్మిన దుకాణం పేరు, రసీదు, ఎంత మొత్తం వచ్చింది. పూర్తి వివరాలు వెల్లడించాలి. రైతులు సామగ్రి, వస్తువులు, పరికరాలు కొనుగోలుకు తీసుకెళ్తున్నట్లయితే వ్యాపార సంస్థల నుంచి ఇన్‌వాయిస్ లేదా కొటేషన్స్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. పంట అమ్మిన డబ్బైతే కొనుగోలు చేసిన వ్యాపారి నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రం ఉండాలి.
వైద్యఖర్చులకు నగదు తీసుకుని వెళ్లే సందర్భంలో ఆసుపత్రి పూర్తి వివరాలు, వైద్య ఖర్చుల బిల్లులు ఉండాలి. తనిఖీల సమయంలో వాటిని చూపించాలి. సంబంధిత ఆరోగ్య నివేదిక, రోగి వివరాలు ఉండాలి.
వ్యాపార లావాదేవీలు చేసే సమయంలో డబ్బు రవాణా చేసే వాటికి సంబంధించిన రసీదు ఉండాలి. వ్యాపారులు అన్ని పన్నులు కట్టి ఉన్నట్లు తనిఖీల్లో నిర్ధారణ అయితే వివరాలు తీసుకుని పంపిస్తారు.
భూముల క్రయ విక్రయాలకు డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఒప్పందపత్రాలు, దస్తావేజులు, మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న స్లాట్ వివరాలు ఉండాలి.
తనిఖీల్లో బంగారం పట్టుబడితే ఏ దుకాణంలో కొనుగోలు చేశారు, పత్రాలు.., పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో వివరాలు, వాటికి సంబంధించిన ఇన్‌వాయిస్ పత్రాలు ఉండాలి.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీ), ఫ్లయింగ్ స్క్వాడ్స్ (ఎఫ్‌ఎస్‌టీ)లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ 4 రోజుల్లో 6 కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. రూ.23.05 లక్షల నగదు, 1,240 కర్ణాటక మద్యం టెట్రాప్యాకెట్లు, 820 గ్రాముల గంజాయి పట్టుకున్నారు.
source : eenadu.net
Discussion about this post