తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర లో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్నీ ఏర్పాట్లు చేశారు. బనగానపల్లె మొత్తం పసుపు మయమైంది.
కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు.
కాగా గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. జగనాసుర వధకు గడువు 46 రోజులేనని.. ప్రజాగళం సభలకు వస్తున్న ప్రజా ఉధృతే ఈ విషయం చెబుతోందని చెప్పారు. మే 13న ఓట్ల సునామీ రాబోతోందని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాష్ర్టానికి, అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయం ప్రతి ఇంట్లో చర్చ జరగాలని.. ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని మరీ ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని అన్నారు. మీ బిడ్డల జీవితాలు బాగుపడాలంటే వైసీపీ అరాచక పాలనకు అంతం పలకాలని ప్రజలకు పిలుపిచ్చారు. జగన్‌రెడ్డి కట్టుకథలకు మోసపోయేందుకు సిద్ధంగా లేరన్నారు. రాబోయేది ఎన్టీయే ప్రభుత్వమేనని, కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160కిపైగా ఎమ్మెల్యే సీట్లు, 24 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని చెప్పారు.
సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్‌రెడ్డి నంగనాచి కబుర్లు చెబుతుండడం చూస్తుంటే నవ్వొస్తోందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో ఆయన మాట్లాడిన తీరు హాలీవుడ్.. బాలీవుడ్ స్థాయి నటనను మించిపోయిందని ఎద్దేవాచేశారు. మనం ‘మహాశక్తి’తో ఆడబిడ్డలను గౌరవిస్తుంటే.. జగన్ సొంత చెల్లెళ్ల పుట్టుకనే ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.
source : andhrajyothi.com
Discussion about this post