టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా తాము వ్యవహరించమని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో తాను గాని, తన కుటుంబం కానీ ఓట్లు వేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఉంటున్న రెయిన్‌ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, రెండో వైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉంటాయని తెలిపారు.
ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ పేర్లు నమోదు చేయడం జరిగిందని అన్నారు. విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాల్సిందిగా జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేశామని తెలిపారు. ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించే ఉంటారని భావిస్తున్నామని చెప్పారు.
ఇన్నాళ్ళ ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదని అన్నారు. తప్పుడు పద్ధతుల్లో, కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా ఎన్నికల్లో తలపడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేళ్ల ప్రభుత్వపాలనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు.ప్రజలు నిశితంగా వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని సజ్జల తెలిపారు.
source : sakshi.com
Discussion about this post