నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెదేపా వాయిదా తీర్మానం
తిరస్కరించిన స్పీకర్
చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యుల తీవ్ర నిరసన
కాగితాలు చింపి స్పీకర్‌పై విసిరిన సభ్యులు
ఇలా చేస్తే తామూ రెచ్చిపోతామన్న మంత్రి అంబటి
తొడ కొడితే కుర్చీ రావడానికి సినిమా కాదన్న అబ్బయ్య చౌదరి
గందరగోళం మధ్యనే ఒక రోజు తెదేపా సభ్యుల సస్పెన్షన్
తెదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ప్రకటన
నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెదేపా ఎమ్మెల్యేల నిరసనలతో రెండోరోజు శాసనసభ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలుకాగానే నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం ఎక్కి నిరసన తెలిపారు. కాగితాలు చింపి స్పీకర్‌పై విసిరారు. ‘ఇక అసెంబ్లీ సమావేశాలు ఉండేది రెండు రోజులే. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్చ జరపాలి’ అని డిమాండు చేసినా స్పీకర్ అంగీకరించలేదు. ఈ నిరసనల మధ్యనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానంపై వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చర్చను ప్రవేశపెట్టారు. ఇది కొనసాగుతుండగానే మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, తెదేపా ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
‘కాగితాలు చింపి స్పీకర్‌పై వేయడమంటే మమ్మల్ని రెచ్చగొట్టడమే. ఇలా వ్యవహరించడం మర్యాద కాదు. మీరు సభా సంప్రదాయాలు తప్పితే మేమూ తప్పవలసి ఉంటుంది. మేం కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది’ అని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. తెదేపా నేతలు నిరసనలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను 40 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా తెదేపా ఎమ్మెల్యేలు పట్టువీడలేదు. పోడియం ఎక్కి నిరసన తెలిపారు. స్పీకర్ వద్ద బల్లను చరుస్తూ, విజిల్ ఊదుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘తెదేపా నేతలకు కుర్చీ మీద వ్యామోహం ఉన్నట్టుంది. ప్రజలు ఆశీర్వదిస్తేనే కుర్చీ వస్తుంది. తొడలు కొడితే కుర్చీలు రావడానికి ఇది సినిమా కాదు… అసెంబ్లీ. ఇక్కడ కుర్చీ రావడమంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి కుర్చీ లాక్కున్నంత సులువు కాదు’ అని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఈ గందరగోళం మధ్యనే తెదేపా ఎమ్మెల్యేలను మంగళవారం మొత్తం ఒక రోజుపాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.
పోడియం వద్ద బైఠాయింపు
స్పీకర్ సస్పెండ్ చేయడంతో తెదేపా ఎమ్మెల్యేలు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ‘విద్యుత్తు ఛార్జీలు తగ్గాలంటే సైకో పోవాలి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే సైకో పోవాలి’ అని మళ్లీ నినాదాలు అందుకున్నారు. దీనికి ప్రతిగా వైకాపా ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, మధుసూదన్‌రెడ్డి ‘సైకిల్ పోవాలి.. జగన్ రావాలి’ అని నినాదాలు చేశారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉందో లేదో చూసుకోవాలంటూ వారికి సూచించారు. వచ్చే ఎన్నికలే తెదేపాకు చివరివంటూ వైకాపా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ వాగ్వాదం కొనసాగుతుండగానే మార్షల్స్ రంగప్రవేశం చేసి తెదేపా సభ్యులను బయటకు పంపారు.
గంటా రాజీనామా ఆమోదం
సభ్యుల నిరసనల మధ్యనే తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమనిధి చట్టం, అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణచౌదరి, జగదీశ్, పరకాల కాళికాంబ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. ఎమ్మెల్యేలు కొద్దిసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు.
source : eenadu.net
Discussion about this post