తెదేపా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురం నియోజకవర్గం నాయకులు ఘనస్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా సుంకలమ్మ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోడ్డు మార్గన హిందూపురానికి బయలుదేరారు. మండల పరిధిలోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఆయన కోసం వేచి ఉన్న తెదేపా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి వచ్చమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని గెలిపించుకుందామని తెలిపారు. ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగులు పక్క రాష్ట్రం కర్ణాటకకు వలస వెళ్లిపోతున్నారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే 20లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు విశ్వనాథరెడ్డి, నాగరాజు, మల్లికార్జున్, నందీశప్ప, అశ్వర్థప్ప, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post