తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో ‘జేసీ’ అభివృద్ధి అజెండా అమలు చేస్తామని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యువ చైతన్యరథం బస్సుయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం యాడికిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఓంశాంతి వద్ద నుంచి చౌడేశ్వరి కల్యాణ మండపం వరకు తెదేపా, జనసేన కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నడుమ జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. సీఎం జగన్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం బటన్ నొక్కడమే ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఎక్కడ చూసినా సైకిల్ హవా కొనసాగుతోందన్నారు. చాగల్లు ద్వారా వృథాగా నీళ్లు వదిలేశారని, వాటినే యాడికి కాలువకు విడుదల చేసి ఉంటే భూగర్భ జలాలు పెరిగేవన్నారు. రెండు మండలాల్లో యాత్రతో సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. ఉద్యానవనం, అరటి, చేనేత హబ్ ఏర్పాటు చేస్తూ, పాల ఉత్పత్తిలో భాగంగా కేంద్రాలను పెట్టి, ఇంటి ఆర్థికాభివృద్ధికి రెండు ఎనుములు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. యాడికి మండలంలో మైనింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ యువత, కార్మికులకు ఉపాధి చూపేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చేయూత ఇస్తానన్నారు. బస్సుయాత్రకు వేలాది మంది తరలిరావడంతో ప్రధాన రహదారి కిక్కిరిసి పోయింది. అంతకు ముందు స్థానిక యువత జేసీకి ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, బాణసంచా పేలుస్తూ.. డప్పు వాయిద్యాలతో ‘సైకో పోవాలి – సైకిల్ రావాలి’ నినాదాలతో హోరెత్తించారు. యువతతో కలిసి అస్మిత్ చిందులు వేశారు. మహిళలు తరలివచ్చి జేసీకి తిలకం దిద్ది, హారతులు పట్టారు. గాంధీ విగ్రహానికి కార్యకర్తలు గజమాల వేశారు. చౌడేశ్వరి కల్యాణ మండపంలో ప్రజలకు విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చవ్వా గోపాల్‌రెడ్డి, జనసేన కదిరి శ్రీకాంత్‌రెడ్డి, రంగయ్య, రుద్రమనాయుడు, చరణ్, జగన్, హరినాథ్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, పెద్దవడుగూరు కొండూరు కేశవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post