వి.కోటలో పెద్దపంజాణి ఎస్సైగా పనిచేస్తోన్న శ్రీనివాసులు రెచ్చిపోయారు. చరవాణిపై తెదేపా స్టిక్కర్ వేసుకున్నాడనే కారణంతో ఆ పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్సై తీరును స్థానికులు తప్పుపట్టగా ‘రేయ్ మీరు నన్ను అరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డికి తెలిస్తే’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. ఇదే నియోజకవర్గమైతే మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఉండేవారు కాదు’ అని వారిని హెచ్చరించారు. తెదేపా నాయకులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వి.కోట మండలం తుపాకీ చిన్నేపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త చెంగప్ప (బాబు) వి.కోటలో సోమవారం రాత్రి జరుగుతున్న వీరాంజనేయస్వామి పుష్పపల్లకీ జాతరకు వస్తున్నారు. అంబేడ్కర్ కూడలి వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు ఆయన ద్విచక్ర వాహనాన్ని నిలిపేశారు. ఇతరులవి అను మతిస్తుండగా తననెందుకు అడ్డుకుం టున్నారని బాబు ప్రశ్నించారు. అక్కడే ఉన్న ఎస్సై శ్రీనివాసులు బాబు జేబులో ఉన్న చరవాణిపై తెదేపా స్టిక్కర్‌ను గమనించారు. ‘రేయ్ నువ్వు తెలుగుదేశం కార్యకర్తవా?’ అంటూ దూషిస్తూ ముఖంపై తన్నారు. పక్కనే ఉన్న ఓ విలేకరి, స్థానికులు అడ్డుచెప్పగా వారిపైనా చిందులు తొక్కారు. విషయం తెలుసుకున్న మండల తెదేపా అధ్యక్షుడు రంగనాథ్, నాయకులు సోము, భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు పలమనేరు- క్రిష్ణగిరి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
source : eenadu.net
Discussion about this post