‘తెదేపా కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఆదరిస్తున్నారు. మళ్లీ ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను అభిమానించే, నా మనసుకు దగ్గరగా ఉండే ప్రాంతం. రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించే జిల్లా.. అన్నిటికంటే ముందుగా నాకు గుర్తుకొచ్చే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు. బీసీ సింహం. 2014లో శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్డులో తొలిసభ పెట్టి తెదేపా విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో మరోసారి అదే ప్రదేశంలో సమావేశంతో గెలుపు చూడబోతున్నాం.’
తెదేపా తొలిజాబితా ప్రకటన తర్వాత ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో నిర్వహించిన సభ విజయవంతమైంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఎటుచూసినా పసుపు జెండాలు రెపరెపలాడాయి. దారులన్నీ జిల్లా కేంద్రం వైపే సాగాయి.. రా కదలి రా అంటూ తెలుగు తమ్ముళ్లు వేదికవైపు ఉత్సాహంగా కదిలారు. అభిమానులు, ఆశావహులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులతో సభాస్థలి కిటకిటలాడింది. జై చంద్రన్న, జై పవన్‌కల్యాణ్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. జిల్లాపై అభిమానం చాటుతూ చంద్రబాబు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అధికారంలోకి వస్తే ఏమిచేస్తామో చెబుతూ వరాలజల్లు కురిపించారు. జగన్ నిరంకుశ ధోరణి, ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ శ్రేణులను ఆలోచింపజేశారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఎలా దోచుకుతింటున్నారో వివరించారు.ఓటువిలువ తెలుసుకోవాలని కొత్తఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఏటా ఉద్యోగావకాశాలు, వర్క్‌స్టేషన్లు, నిరుద్యోగ భృతి వంటి హామీలు ప్రకటిస్తూ యువతను ఆకట్టుకున్నారు. తమ ప్రభుత్వంలో ఇచ్చే సంక్షేమాన్ని వివరిస్తూ అన్నివర్గాలకు దగ్గరయ్యారు.
source : eenadu.net
Discussion about this post