రానున్న ఎన్నికల్లో విజయం తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
‘‘ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకి ఎలా కండిషన్స్ ఉండవో.. ఇక్కడి ప్రజలూ అంతే. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టి గడ్డ ఇది. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. తెదేపా పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్‌గా మార్చారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ఆయన.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. మోసం, దగా, కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్‌లా ఉంటుంది.
2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైకాపా హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయన్నారు. స్కూల్ రేషనలైజేషన్ పేరుతో పోస్టులు తగ్గించారు. ఇప్పుడు ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా 70వేల పోస్టులు భర్తీ చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం.
source : eenadu.net
Discussion about this post