ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో గంగుల వర్గానికి షాక్ తగిలింది. వైకాపాలో కీలక నేతగా ఉన్న శ్రీనివాసరెడ్డి(వాసు) గురువారం విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆయన మాజీ ఎమ్మెల్యే సీపీ తిమ్మారెడ్డి మనవడు. కేంద్ర కాటన్ బోర్డు మాజీ డైరెక్టరుగా పనిచేశారు. తొలుత భూమా కుటుంబంతో రాజకీయాల్లో కలసి తిరిగిన ఆయన కుటుంబ సభ్యులు 2004లో భూమా నాగిరెడ్డితో విభేదించి గంగుల వర్గంలో చేరారు. అప్పటినుంచి 20 ఏళ్ల పాటు గంగుల కుటుంబంతో నడిచారు. ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో మనస్పర్థలు రావడంతో ఆ వర్గంతో అంటీముట్టనట్లు ఉంటూ వచ్చారు. ఈయన పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా ఎట్టకేలకు గురువారం అధికారికంగా మాజీ మంత్రులు భూమా అఖిలప్రియ, ఏరాసు ప్రతాపరెడ్డిల సమక్షంలో వాసుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తెదేపాలో చేరారు.
ప్రతాపరెడ్డి సైకిలెక్కనున్నారా?
గంగుల కుటుంబంలో నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డితో వాసుకు సాన్నిహిత్యం ఎక్కువ. వాసు చేరికలో ప్రతాపరెడ్డి ఆశీస్సులు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెదేపా తరఫున నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా గంగుల ప్రతాపరెడ్డి పోటీ చేయాలన్న ఆశతో ఉన్నారు. వాసు చేరిక కోసం జరిగిన చర్చల్లో గంగుల ప్రతాపరెడ్డికి పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారుపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే గంగుల ప్రతాపరెడ్డి వియ్యంకుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా తెదేపాలో చేరారు. గంగులకు నంద్యాల ఎంపీ సీటు ఇవ్వాలని పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ తెదేపా అభ్యర్థులతో పాటు, వీరశివారెడ్డి నుంచి కూడా చంద్రబాబుపై ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.
source : eenadu.net
Discussion about this post