తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో అనంతపురం గ్రామీణం రాచానపల్లి పంచాయతీ సిండికేట్‌నగర్‌కు చెందిన 15 కుటుంబాలు, రాప్తాడు మండలం మరూరు పంచాయతీ చాపట్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు తెదేపాలోకి చేరారు. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. వారందరికీ కండువాలు కప్పి తెదేపాలోకి సాదరంగా ఆహ్వానించారు. వారందరికీ పరిటాల సునీత, సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి, చియ్యేడు, పూలకుంట, ఇటుకులపల్లి, చిన్నకుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకునే వారికి బిల్లులు కూడా చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. గ్రామాల్లో అర్హత ఉన్నా పింఛన్లను తొలగించడం, రేషన్ కార్డులు తీసివేయడం, ఇళ్లపట్టాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post