నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం మోసగించిందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి అన్నారు. కర్నూలు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో ‘రాయలసీమ నిరుద్యోగ గర్జన’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంతోనే యువతకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే విస్మరించారని ధ్వజమెత్తారు. కబ్జాదారులను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ తెదేపా హయాంలో యువత, నిరుద్యోగుల కోసం పలు పథకాలు అమలయ్యాయని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ తెదేపా హయాంలోనే పాణ్యం నియోజకవర్గానికి పలు పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. పరిశ్రమల యజమానులను వైకాపా నేతలు వేధిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఐకాస ఛైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ అందరూ అన్నం తింటుంటే.. ఓ నేత ఏకంగా భూములు, ఎర్రమట్టి లాంటివి తింటున్నారని ఎద్దేవా చేశారు. పాణ్యం నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
source : eenadu.net
Discussion about this post