తెదేపాతోనే కార్మికుల అభ్యున్నతి సాధ్యమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో టెక్కిలి నుంచి కుప్పం వరకు చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఇక్కడికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 6న టెక్కలిలో ప్రారంభమైన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర కుప్పం దాకా 23 పార్లమెంట్, 102 శాసనసభ నియోజకవర్గాలు, 3347 కి.మీ. సాగి దిగ్విజయంగా ముగిసిందన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలోని కార్మికులందరూ కడుపునిండా అన్నం తినేవారని, ప్రస్తుత అరాచక వైకాపా పాలనలో అన్న క్యాంటీన్లను మూసివేసి వారిని రోడ్డున పడేశారన్నారు. ముద్దులు పెట్టి గుద్దులు గుద్దే నాయకుడు మాకొద్దని, కార్మికులకు పట్టెడన్నం పెట్టే నాయకుడు కావాలని, అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కార్మిక సంక్షేమ పథకాలన్నీ తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం, మున్సిపల్ తెదేపా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు సత్యం శేఖర్, టీఎన్టీయూసీ నాయకులు సబ్బతి ఫణేశ్వరరావు, పరుచూరి ప్రసాద్, మల్లికార్జునరావు, నాగోతు శివాజీ, లింగంపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post