కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం 260 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం వీరు నావిక్ జనరల్ డ్యూటీ సేవల్లో చేరతారు. వీరు లెవెల్-3 వేతనం అందుకోవచ్చు. దశలవారీ వృత్తిలో పదోన్నతులకూ అవకాశం ఉంది.
దాదాపు ఏటా రెండు సార్లు నావిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్టు గార్డు ప్రకటనలు వెలువరిస్తోంది. వీటికి పురుషులే అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షకు సంబంధించి సిలబస్ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రాలు కోస్టు గార్డు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు.
పరీక్ష ఇలా..
ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు. నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 2 సెక్షన్లలో ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్-1:ఇందులో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
సెక్షన్-2:ఈ విభాగానికి 50 మార్కులు. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
అర్హత పొందాలంటే..
ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్ అభ్యర్థులు సెక్షన్-1లో 30, సెక్షన్-2లో 20 చొప్పున మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలకు.. సెక్షన్-1లో 27, సెక్షన్-2లో 17 చొప్పున మార్కులు వస్తే అర్హులుగా పరిగణిస్తారు.
శిక్షణ, వేతనం
ఈ పోస్టులో చేరే అవకాశం వచ్చినవారికి ప్రాథమిక శిక్షణ సెప్టెంబరు, 2024 నుంచి ఐఎన్‌ఎస్ చిల్కలో ప్రారంభమవుతుంది. ఇది 16 వారాలు కొనసాగుతుంది. ఆ తర్వాత వీరికి సముద్రంలో సుమారు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు శిక్షణ అందిస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. నావిక్ పోస్టుల్లో చేరినవారికి లెవెల్-3 మూలవేతనం రూ.21,700 చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి ఈ పోస్టుల్లో చేరినవారు సుమారు రూ.40 వేలు వేతనం పొందవచ్చు. భవిష్యత్తులో వీరు నావిక్ నుంచి.. ఉత్తమ్ నావిక్, ప్రధాన నావిక్, అధికారి, ఉత్తమ్ అధికారి, ప్రధానాధికారి (లెవెల్-8) హోదా వరకు చేరుకోవచ్చు. ఉచితంగా రేషన్, దుస్తులు, వైద్యం అందిస్తారు. వసతి కల్పిస్తారు. క్యాంటీన్ సదుపాయం ఉంటుంది. ఏడాదికి 45 ఆర్జిత, 8 సాధారణ సెలవులు లభిస్తాయి.
ఖాళీలు:260 (ఈస్ట్ జోన్‌లో 33)
అర్హత:మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్
వయసు: కనిష్ఠంగా 18 నుంచి గరిష్ఠంగా 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే సెప్టెంబరు 1, 2002 – ఆగస్టు 31, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు: ఫిబ్రవరి 13 ఉదయం 11 గంటల నుంచి – ఫిబ్రవరి 27 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.
ఫీజు:రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనక్కర్లేదు.
పరీక్షలు: స్టేజ్-1 ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.స్జేజ్-2 మేలో, స్టేజ్-3 అక్టోబరులో ఉంటాయి.
స్టేజ్-1 పరీక్ష కేంద్రాలు:
తెలంగాణలో.. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ.
వెబ్‌సైట్: https://join indiancoastguard. cdac.in/
Discussion about this post