‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, ప్రత్తిపాడు ప్రజాగళం సభల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు హాజరైనవారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఇది తాడికొండ కాదు. రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చి రాష్ట్రం నడిబొడ్డు నుంచి, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశ అమరావతి. అమరావతి రాజధానిగా ఉంటుందని తాడికొండలో ప్రకటిస్తున్నాను. మరో 30 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. మీరు లిఖించబోయే చరిత్ర కళ్లముందు కనిపిస్తోంది. ప్రజాభిమానం చూస్తుంటే జగన్‌రెడ్డికి సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. జూన్ 4న సగర్వంగా అమరావతే రాజధాని అని మీరు ఉత్సవాలు చేసుకోండి. అదేరోజు జగనాసుర వధ జరుగుతుంది. ప్రజలు గెలవాలి.. జగన్ పోవాలి అనే నినాదంతో జనం ముందడుగు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
source : eenadu.net
Discussion about this post