ఇన్నాళ్లూ జై కొట్టిన మడకశిర తెలుగు తమ్ముళ్లు…ఇప్పుడు అధినేత చంద్రబాబుకు చెప్పు చూపుతున్నారు. దళితులను నమ్మించి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు బాబూ’ అంటూ ఆదివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని, తమ సత్తా ఏమిటో చూపుతామంటున్నారు.
మడకశిర టీడీపీ టికెట్ కేటాయింపు రోజుకో మలుపు తిరిగి చివరకు బీఫాం మాత్రం స్థానికేతరుడు ఎంఎస్ రాజుకు దక్కింది. తానేంటో చూపుతానంటూ చెప్పిన గుండుమల తిప్పేస్వామి తన మాట నెగ్గించుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబే ప్రకటించగా, నెలరోజుల పాటు ప్రచారం చేసి చివరకు నామినేషన్ కూడా వేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కుమార్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మడకశిరలో ఈరన్న, గుండుమల తిప్పేస్వామి వర్గాల మధ్య రెండున్నరేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా అనుచరులూ చెలరేగిపోవడంతో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో టికెట్ కోసం రెండు వర్గాలూ గట్టిగానే ప్రయత్నాలు చేశాయి. చివరకు ఫిబ్రవరి 24న మడకశిర టికెట్‌ను సునీల్‌కుమార్‌కు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అదేరోజు గుండుమల వర్గం ఆందోళనకు దిగింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఈరన్న కుమారుడు సునీల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. దాదాపు నియోజకవర్గమంతా చుట్టేశారు. మడకశిరలో మోటార్‌బైక్ ర్యాలీ, నారా లోకేశ్ సభలు నిర్వహించారు. పెనుకొండలో జరిగిన చంద్రబాబు సభకు జనసమీకరణ చేశారు. అయినా అధిష్టానం ఆయన్ను చివరి నిమిషంలో పక్కన పెట్టడం గమనార్హం.
source : sakshi.com
Discussion about this post